03-05-2025 01:43:17 AM
గాలివానకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పేద కుటుంబం
మహబూబాబాద్, మే 2 (విజయ క్రాంతి): వరంగల్ జిల్లాలో గాలివాన వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఉమ్మడి వరంగల్ జిల్లాను కుదిపేసిన గాలివాన మళ్లీ గురువారం రాత్రి విరుచుకుపడింది. పెను గాలులతో కూడిన వర్షం కురవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వృక్షాలు విరిగిపడ్డాయి.
అలాగే చెట్లు విద్యుత్తు లైన్ల పై పడడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా కు తీవ్ర ఆటంకంగా మారింది. ఇక పలుచోట్ల కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోగా పలుచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. అలాగే మామిడి తోటలకు తీవ్రనాష్టం వాటిల్లింది.
ఆరబోసిన మిర్చి పంట తడిసిపోయి రంగు మారింది. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో పెనుగాలులకు ఇండ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. రేకులు వేసుకుని జీవనం సాగిస్తున్న తమకు పెనుగాలులు నిలువ నీడ లేకుండా చేశాయని పేదలు కన్నీరు పెడుతున్నారు. గడచిన పక్షం రోజుల్లో మూడుసార్లు గాలివాన బీభత్సానికి ఓరుగల్లు విలవిలలాడింది.
ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మహబూబాబాద్ ఖమ్మం మార్గంలో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా ఆర్టీసీ సర్వీసులను ఉదయం పూటపాక్షికంగా నిలిపివేశారు.