06-01-2026 01:36:25 AM
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి) : బీసీలకు బడ్జెట్‌లో కేటాయించే నిధులు ఎక్కువగా ఉంటాయని, కానీ ఖర్చు చేసేది మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి, దానికి రూ.21 కోట్లు కేటాయించింది. కానీ ఖర్చు చేసింది మాత్రం రూ.3 కోట్లా 49 లక్షలు మాత్రమే అని పే ర్కొన్నారు.
శాసనమండలిలో ఎమ్మెల్సీ తీ న్మార్ మల్లన్న ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ...ప్రభుత్వం 2025- బడ్జెట్‌లో రూ. 11,500 కోట్లను కేటాయించి అందులో రూ.2,426 కోట్లే ఖర్చు చేశారన్నారు. అంటే ఇది 20 శాతం కూడా కాదు, మరీ మిగిలిన రూ.9000 కోట్లను ఎప్పుడు ఖర్చు చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్తూనే బీసీలను కాంగ్రెస్ ప్రభు త్వం మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద బిడ్డలకు చేయూతనివ్వడం కో సం కళ్యాణలక్ష్మి పథకం కోసం రూ.2,173 కోట్లు ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేటాయిస్తే ఖర్చు చేసింది మాత్రం రూ.107 కోట్లే నని, అది కూడా ఇప్పుడు పెళ్లి జరిగితే కొడు కు పుట్టిన తరువాత చెక్కులు ఇస్తున్నారని తెలిపారు. బీసీల జీవనోపాధి కోసం రూ.4,622 కోట్లను బడ్జెట్‌లో కేటాయించి, ఖర్చు పెట్టింది రూ.201 కోట్లు మాత్రమే అని తెలిపారు. గౌడన్నల కోసం ఇస్తున్న కాటమయ కిట్ల కోసం రూ.70 కోట్లను బడ్జె ట్‌లో కేటాయించి, రూ.19 కోట్లనే ఖర్చు చేసిందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం రూ.450కోట్ల బడ్జెట్ కేటాయించి రూ.168 కోట్లనే ఖర్చుచేసిందని, రాజీవ్‌యువ వికాస్ కింద రూ.4,102 కోట్లను బీసీ యువత కోసం ఖర్చు చేస్తాం అని చెప్పి రూ.13 కోట్లే ఖర్చు చేసినట్టు తెలిపారు.
ఇంకో నెల ఐతే ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, పెం డింగ్‌లో ఉన్న ఈ రూ.9 వేల కోట్ల బడ్జెట్ బీసీలకు ఎలా ఖర్చు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రతి బడ్జెట్‌లో బీసీల కోసం రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తూ 5 సంవత్సరాలకు రూ.1 లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.2,500 కోట్లే ఖర్చు చేశారన్నారు. బీసీల లెక్కలు తీయడంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఎంబీసీల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించి అందులో కేవలం రూ.4 కోట్లనే ఖర్చు చేశారని గుర్తు చేశారు.