calender_icon.png 16 November, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల క్రికెట్‌కు మరింత జోష్

16-11-2025 12:00:00 AM

-వరల్డ్‌కప్ విజయంతో పెరిగిన క్రేజ్

-నేర్చుకునేందుకు అమ్మాయిల ఆసక్తి

-ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు

ఒక్క విజయం దేనినైనా  మార్చేస్తుంది... ఒక్క గెలుపు మహామార్పుకు పునాది వేస్తుంది... ఒక్క నిర్ణయం అద్భుతమైన  భవిష్యత్తుకు చిరునామాగా మారుతుంది... ప్రస్తుతం ఈ మాటలు భారత్‌లో మహిళల క్రికెట్‌కు సరిగ్గా సరిపోతాయి. నిన్నటి వరకూ  పురుషుల క్రికెట్‌తో పోటీపడుతూ అప్పుడప్పుడూ విజయాలు సాధించిన భారత మహిళల జట్టు ప్రపంచకప్ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ నేర్చుకునే అమ్మాయిల్లో కొత్త జోష్ నింపింది. దీంతో మెట్రో  నగరాల్లోనే కాదు జిల్లాల్లోనూ క్రికెట్‌పై అమ్మాయిల ఆసక్తి పెరుగుతోంది. ఇక హైదరాబాద్  సంగతి అయితే  చెప్పక్కర్లేదు. అకాడమీల్లో అబ్బాయిలతో పోటీ పడుతూ అమ్మాయిలు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు.

మన దేశంలో క్రికెట్ మతమైతే క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా 1983 ప్రపంచకప్‌కు ముందు ఆ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇలా చూడొచ్చు భారత క్రికెట్‌ను.. ఎందుకంటే కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు అప్పటి వరకూ వరల్డ్ క్రికెట్‌ను శాసిస్తున్న విండీస్‌కు షాకిచ్చి విశ్వవిజేతగా నిలిచింది. అక్కడి నుంచి క్రికెట్‌లో మన హవా, ఆటగాళ్ల క్రేజ్  ఓ రేంజ్‌లో పెరిగింది. అదే సమయంలో మహిళల క్రికెట్‌కు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. అసలు మహిళల క్రికెట్‌కు ప్లేయర్స్ కూడా కరువైన పరిస్థితి కూడా ఉండేది. 1913లో కేరళలోని కొట్టాయం లో మహిళల క్రికెట్ ప్రయాణానికి పునాది పడింది. 

అబ్బాయిల ఆట మీకెందుకు ?

అప్పుడప్పుడు మ్యాచ్‌లు ఆడే పరిస్థితి కనిపించినా అమ్మాయిలకు క్రికెట్ ఏంటి.. అది అబ్బాయిల ఆట మీకెందుకు? అంటూ తల్లిదండ్రులు వారిని వెనక్కి లాగిన సందర్భాలున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. అప్పటికి మహిళల క్రికెట్‌కు అస్సలు ఆదరణ లేకపోవడం, దెబ్బలు తగిలే అవకాశాలు, అప్పటి సంప్రదాయ పరిస్థితులు ఇలాంటివన్నీ అడ్డంకిగా నిలిచాయి. పైగా పురుషుల క్రికెట్ జట్టును ప్రోత్సహించిన స్థాయిలో మహిళల జట్టుకు సరైన ప్రోత్సాహం లభించలేదు.

స్పాన్సర్లు లేకపోనడంతో కనీసం ప్లేయర్లకు జెర్సీలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 1978లో భారత్ తొలిసారి వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చినప్పుడు ప్లేయర్స్‌కు డబ్బులు ఇవ్వడానికి గేట్ కలెక్షన్లపై ఆధారపడాల్సి వచ్చింది. మ్యాచ్‌ల కోసం ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు కళ్యాణ మండపాలు, బొద్దింక లు, ఎలుకలు తిరిగే గదుల్లో వారికి వసతి ఇచ్చిన పరిస్థితులను శాంత రంగస్వామి వంటి మాజీ క్రికెటర్లు చూశారు.

బీసీసీఐ నిర్ణయమే మలుపు :

తర్వాత కాలం మారింది. తరాలు మారాయి. వాటితో పాటే పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది.కాలంతో పాటే వచ్చిన మార్పులు మహిళల క్రికెట్‌ను మార్చేశాయి. ముఖ్యంగా 2006లో ఐసీసీ ఒత్తిడితో బీసీసీఐ మహిళల క్రికెట్ అసోసియేషన్‌ను విలీనం చేసుకోవడం మలుపు తిప్పింది. అప్పటి వరకూ డబ్బులు లేకుండా ఆడిన ప్లేయర్లకు క్రమంగా మ్యాచ్ ఫీజులు రావడం మొదలైంది. ఐసీసీ కూడా ప్రపంచకప్‌లను అద్భుతంగా నిర్వహిస్తూ మహిళా జట్లను ప్రోత్సహించింది. భారత్ కూడా అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా ఎదిగింది. 

డబ్ల్యూపీఎల్‌తో పెరిగిన క్రేజ్

ఇక బీసీసీఐ మహిళా క్రికెటర్ల కోసం తెచ్చిన వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో భారత్‌లో అమ్మాయిల క్రికెట్ క్రేజ్ మరింత పెరిగింది. అప్పటి వరకూ అమ్మాయిలకు క్రికెట్ ఎందుకు అన్న తల్లిదండ్రులే ఇప్పుడు స్వయంగా తమ పిల్లలను కోచింగ్‌కు పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మాయిలకు ప్రోత్సాహం బాగానే లభిస్తోంది. అందుకే జాతీయ జట్టులో తెలుగు రాష్ట్రాల అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

తాజాగా సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టు ప్రపంచకప్ గెలవడంతో మరింత జోష్ వచ్చింది. . ఇప్పుడు ప్రపంచకప్ విజయంతో హైదరాబాద్‌లో క్రికెట్ నేర్చుకునే అమ్మాయిల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిన్న మొన్నటి వరకూ క్రికెట్‌కు ఏం పంపిస్తాంలే అనుకున్న తల్లిదండ్రులే వారిని స్వయంగా కోచింగ్‌కు తీసుకెళుతున్నారు. నగరంలో ఇప్పుడు ఏ క్రికెట్ అకాడమీ చూసినా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. 

పురుషుల క్రికెట్‌తో పోటీ

బీసీసీఐ మహిళల క్రికెట్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డబ్బు పరంగా, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల పరంగా, వసతి సౌకర్యాల పరంగా, క్రేజ్ పరంగా ఇలా అన్నింటిలోనూ పురుషుల క్రికెట్‌తో పోటీపడుతున్నారు మన మహిళా క్రికెటర్లు. ప్రస్తుతం క్రికెట్ నేర్చుకునే అమ్మాయిలను కదిలిస్తే డబ్ల్యూపీఎల్‌కు, ఇండియాకు ఆడడమే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు.

హైదరాబాద్‌లో పలు అకాడమీలు అమ్మాయిల ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా కోచ్‌లను నియమించుకుంటున్నాయంటే ఎలాంటి మార్పు వచ్చిందో అర్థమ వుతోంది. మిథాలీ రాజ్ , జులన్ గోస్వామి వంటి దిగ్గజాల తర్వాత భారత మహిళల క్రికెట్‌కు ఎవరున్నారంటూ అప్పట్లో కొన్ని సందేహాలుండేవి.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లతో పోలిస్తే మన రిజర్వ్ బెంచ్  మొన్నటి వరకూ అంతంత మాత్రం. కానీ డబ్ల్యూపీఎల్ మొదలైన తర్వాత  వుమెన్స్ క్రికెట్‌లో దాగి ఉన్న టాలెంట్ కూడా బయటకొస్తోంది. ఇప్పుడు ప్రపంచకప్ విజయంతో క్రేజ్ పెరగడంతో మన వుమెన్స్ టీమ్ ఫ్యూచర్ కళ్ల ముందే కనిపిస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో కచ్చితంగా వరల్డ్ క్రికెట్‌ను భారత మహిళల జట్టును శాసిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 ఖేల్ ప్రతినిధి, విజయక్రాంతి

క్రేజ్ బాగా పెరిగింది 

క్రికెట్ నేర్చుకునే అ మ్మాయిల సంఖ్య బా గా పెరిగింది. పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నారు. మ హిళల క్రికెట్‌ను ప్రోత్సహించే విషయంలో బీ సీసీఐ తీసుకున్న నిర్ణ యాలే దీనికి కారణం. అమ్మాయిల క్రికెట్‌లో క్వాలిటీ పెరిగిందంటే ఎంత టాలెంట్ ఉందో అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో మెన్స్ టీమ్స్‌తో వుమెన్ టీమ్స్ మ్యాచ్‌లు ఆడడం చూస్తాం.

షబ్బీర్, క్రికెట్ కోచ్

ప్రత్యేకంగా టోర్నీలు

నేను జూ.స్థాయి లో క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తున్నప్పుడు అమ్మాయిల జట్లు ఉండేవి కాదు. ఇప్పు డు వారి ప్రాతినిథ్యం పెరుగుతుండడంతో ప్రత్యేకంగా టోర్నీలు నిర్వహిస్తున్నా. 

 వెంకటేష్, 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండర్

భారత్‌కు ఆడడమే లక్ష్యం

క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. మా పేరెంట్స్ ప్రోత్సాహిస్తున్నారు. కోహ్లీ, మిథాలీ, హర్మన్‌ప్రీత్ నాకు స్ఫూర్తి. భారత జట్టుకు ఆడడమే నా లక్ష్యం. -

 హర్షిణి ప్రియ కొండ్రెడ్డి, క్రికెటర్

క్రికెట్ ఇష్టం

మా డాడీకి స్పోర్ట్స్ అంటే ఇ ష్టం. నాకు కూడా క్రికెట్ అంటే ఆసక్తి ఉండడంతో కోచింగ్ తీసుకుంటున్నా. ఇండియాకు ఆడడమే టార్గెట్‌గా పెట్టుకున్నా.

 అశ్విక, క్రికెటర్