06-12-2024 01:55:28 AM
హుజూర్‌నగర్, డిసెంబర్ 5: కుమారుడితో సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ మండల పరిధిలోని లక్కవరం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కవరం గ్రామానికి చెందిన రణపంగు నవీన్‌కు గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన మమతతో 2018లో వివాహం జరిగింది.
వారికి కుమార్తె సాన్వి, కుమారుడు హయాన్(11 నెలలు) ఉన్నారు. నవీన్ హుజూర్‌నగర్‌పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో కంపౌండర్‌గా పనిచేస్తుండగా, మమత ఇంటి వద్దనే ఉంటున్నది. ఈ నెల 4వ తేదీన డ్యూటీకి వెళ్లిన నవీన్ రాత్రి ఇంటికి వెళ్లి చూడగా.. కుమార్తె సాన్వి ఒక్కతే ఇంటి వద్ద కనిపించింది. భార్య మమత, కుమారుడు హయాన్ కనిపించలేదు.
వారి కోసం బయటకు వెళ్లి వెతకిన నవీన్‌కు ఇంటి సమీపంలోని ఓ బావిలో ఇద్దరూ కనిపిం చారు. దీంతో వెంటనే గ్రామస్థుల సహాయం తో నీవన్ మమతను ఒడ్డుకు చేర్చి కాపాడాడు. హయాన్‌ను నీటి నుంచి బయటకు తీసుకురాగా అప్పటికే చనిపోయాడు. నవీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ముత్తయ్య తెలిపారు.