17-05-2025 09:40:19 AM
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్,(విజయక్రాంతి): కేటీఆర్ ఒక సైకో రామ్ అని, కల్లుతాగిన కోతిలా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రామప్పగుడి వద్ద మిస్‌వరల్డ్‌లో పోటీల్లో పాల్గొనే వారి కాళ్లను ఎవరో ఒకరు అత్యుత్సాహంతో కడితే కేటీఆర్ పనిగట్టుకుని విమర్శలు చేయడం, తెలంగాణ మహిళల ఆత్మగౌరవం ఏమైందని సోనియాగాంధీకి ట్వీట్ చేయడం సరికాదని ఎంపీ చామల హితవు పలికారు.
శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల ఇంటి ఆడబిడ్డ గురించి తప్పా ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదని, అలాంటి కేటీఆర్ ఇప్పుడు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని, కానీ కేటీఆర్ మాత్రం మాటిమాటికీ డిస్టర్బ్ చేస్తున్నారన్నారు.