24-08-2025 11:29:48 AM
హైదరాబాద్: సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విద్యార్థి నాయకుడి నుండి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ముందుకు వచ్చి మద్దతు తెలిపి, మాతో నడిచిన వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని పేర్కొన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని, తెలంగాణ ఏర్పాటుకు సీపీఐ మద్దతులో సురవరం పాత్ర మరువలేనిదని అన్నారు. వారి కుటుంబసభ్యులకు, కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి మా నాయకుడి తరపున, మా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.