09-10-2025 08:12:10 AM
ఎటూ తేలని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ.
నేటికి వాయిదా వేసిన హైకోర్టు. నామినేషన్ల స్వీకరణకు స్టే నిరాకరణ.
నేటి నుంచే నామినేషన్ల స్వీకరణకు అధికారుల ఏర్పాట్లు.
హై కమాండ్ చెంతకు ఆశావహుల జాబితా.
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో 9 ప్రకారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతోపాటు నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంఫై దాఖలైన పిటిషన్ బుధవారం ఓ కొలిక్కి వస్తుందని జిల్లాలోని ఆయా గ్రామాల్లో రాజకీయ నేతలు ఉత్కంఠగా ఎదురు చూసారు. కానీ విచారణ గురువారం నేటికి వాయిదా వేయడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ స్టే విధించేందుకు కూడా నిరాకరించడంతో జిల్లా అధికార యంత్రాంగం నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
పార్టీలలో జోరుగా చర్చలు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై రిజర్వేషన్ ఆధారంగా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల వారీగా ఆశావహుల పేర్లను సేకరించిన ఆయా పార్టీల హైకమాండ్ ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్ అంశంలో మార్పులు జరిగితే ప్రస్తుతం సేకరించిన జాబితాలోనూ మార్పులు జరిగే ఆస్కారం ఉందని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జడ్పీ చైర్మన్ పీఠం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆశావాహుల, ఆయా మండలాల్లో ఏర్పడిన రిజర్వేషన్ ఆధారంగా జడ్పిటిసి స్థానం కోసం ఆశపడ్డవారి పేర్లను సుమారు ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున సేకరించినట్లు ఆయా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొల్లాపూర్, కల్వకుర్తి, పెంట్లవెల్లి, తాడూరు, తెలకపల్లి వంటి మండలాల్లో పోటీదారులు తమ అర్హతపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.
నామినేషన్‌ల స్వీకరణకు సన్నాహాలు పూర్తి.
రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్ని మండలాల్లో రిటర్నింగ్ అధికారుల ద్వారా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు విభాగం భద్రతా చర్యలను కూడా పటిష్టం చేసింది. ఆయా మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీలు జడ్పిటిసి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ కోసం కౌంటర్లను ఏర్పాటు చేశారు ప్రతి ఎంపీడీవో కార్యాలయం ముందు సుమారు 100 మీటర్ల దూరం వరకు భారీ కేట్లను ఏర్పాటు చేస్తూ 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
జిల్లాలో మొత్తం 115 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్‌ల ప్రక్రియ అక్టోబర్ 12 వరకు కొనసాగనుండగా, పరిశీలన, ఉపసంహరణల అనంతరం తుది జాబితా ప్రకటించబడనుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుండగా బీసీ రిజర్వేషన్ల తుది జాబితా కోసం అన్ని పార్టీలు కళ్లప్పగించి ఎదురుచూస్తున్నాయి. రిజర్వేషన్ల పంపిణీతో కొన్ని కీలక మండలాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.