09-10-2025 01:48:43 AM
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ప్రైవేట్ ఇంజినీరింగ్‌తో సహా వృత్తి విద్యా కళాశాలన్నీ 13 నుంచి తలపెట్టిన సమ్మె, కాలేజీల బంద్‌ను వాయిదావేస్తున్నట్లు ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) బుధవారం ప్రకటించింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేంద ర్ రెడ్డితో ‘ఫతి’ కమిటీ సభ్యులు పెం డింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై జరిపిన చర్చలు సఫలమైన ట్లు వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాలేజీల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ దీపావళి నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో కనీసం రూ.300 కోట్లు విడుదల చేసేలా తాను ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే అప్పటివరకు సమ్మెకు వెళ్ల కుండా ఆగాలని ‘ఫతి’ సభ్యులను ఆయన కోరినట్లు పేర్కొన్నారు. దీనితో ఈనెల 23వ తేదీ వరకు కాలేజీల సమ్మె, బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఒకవేళ ప్రభుత్వం దీపావళి నాటికి బకాయిలు విడుదల చేయకుంటే 23న తాము సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొ న్నారు. దసరాకు కొన్ని కాలేజీలకు రూ. 200 కోట్లను ప్రభుత్వం విడుదల చేయ గా, మరికొన్ని కాలేజీలకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని పేర్కొన్నారు.