calender_icon.png 9 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కోటపై హైకోర్టులో విచారణ నేటికి వాయిదా

09-10-2025 01:30:06 AM

మధ్యాహ్నం 2.15 గంటలకు.. 

నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోని కోర్టు

ట్రిపుల్ టెస్టును పాటించలేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాది 

సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా?: ప్రభుత్వం తరఫు న్యాయవాది సింఘ్వీ

కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేశారా?: హైకోర్టు ధర్మాసనం ప్రశ్న

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ గురు వారానికి వాయిదా పడింది. మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.  స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషన్ కోరారు. అయితే పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీచేసిన విష యం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూ లంగా ఆర్ కృష్ణయ్య, వీ హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిం ది.

బుధవారం మొదట పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించరాదన్నారు. విద్య, ఉద్యోగాల్లో 50శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని చెప్పారు. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదన్నారు. ‘42శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదు. బీసీ కులగణన చేశారు.. కానీ బహిర్గతం చే యలేదు. బీసీ కులగణన ఆధారంగా 42శా తం రిజర్వేషన్లు అంటున్నారు.

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు ప్రభుత్వం వద్ద లేవు. ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా? 2018లో 34శాతం బీసీ రిజర్వేషన్లు ఇదే కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదు. అయితే రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారు?’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు విచారణలో ట్రిపుల్ టెస్ట్ అంశం కీలకంగా మారింది. ట్రిపుల్ టెస్ట్‌ను పాటించకుండా రిజర్వేషన్లపై చట్టం చేయలేరంటూ పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. ‘ట్రిపుల్ టెస్టు లేకుండానే రిజర్వేషన్లను పెంచారు. కేవలం వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారు. రిజర్వేషన్ల బిల్లు పాస్ అయ్యింది కానీ, గవర్నర్ ఆమోదం తెలపలేదన్నారు.

ఎంపిరికల్ డేటా కూడా సరిగా లేదు. ఎన్నికలను నిలిపివేయాలని మేము కోరడం లేదు. రిజర్వేషన్ల పెంపుపై శాస్త్రీయ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించలేదు. ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలను బహిర్గతం చేయలేదు. 2021 డిసెంబర్లో ట్రిపుల్ టెస్టు మార్గదర్శకాలు విడదలయ్యాయి. 2018లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపును హైకోర్టు తప్పు పట్టిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. ట్రిపుల్ మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. మూడు స్థాయిల్లో పరీక్షల తర్వాత రిజర్వేషన్లు పెంచవచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి’ అని ఆయన వాదించారు. 

సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా..? 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది. జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. బీసీ ప్రత్యేక (డెడికేటెడ్) కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొచ్చు.

శాసనవ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. సవరణ చేసినా, చట్టం చేసినా శాసనవ్యవస్థదే నిర్ణయం. చట్టసభలు చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు. నెలలపాటు ఏ నిర్ణయమూ చెప్పడం లేదు. బిల్లును ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు, తిప్పిపంపడం లేదు. తమిళనాడులో ఒక బిల్లు ఏళ్లతరబడి గవర్నర్ వద్దే ఉంది. ప్రజల ద్వారా ఎన్నికైన సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా? ఆర్టికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారు.

వారు నిర్ణయం తీసుకోకపోవడంతో వ్యవస్థ స్తంభించిపోతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులున్నాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను సింఘ్వీ కోర్టుకు అందజేశారు. ‘ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారు, జీవో తెచ్చారు.

పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి వాదనలు సమర్పిస్తాం’ అని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదని కచ్చితమైన వివరణ రాజ్యాంగంలో ఎక్కడా లేదని, కచ్చితమైన ప్రాధమిక, సామాజిక లబ్ధి అంశాలుంటే రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండొచ్చునని ఆయన వాదించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదనుకుంటే సరైన డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచారనే వాదనకు అర్ధం లేదని అన్నారు.

కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేశారా..? 

ఇరు పక్షాల వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా?. గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటినుంచి పెండింగ్‌లో ఉంది?, ట్రిపుల్ టెస్టు విధానం అమలుచేశారా?, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా నిర్వహించారు?, కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేశారా?, ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా?.. అంటూ హైకోర్టు ప్రశ్నించింది. షెడ్యూల్ నోటిఫై అయ్యిందా? అని కూడా ఏజీని ప్రశ్నించింది. వాదనలు ఇంకా వినిపించాల్సి ఉన్నందున విచారణ రేపటికి వాయిదా వేయాలని ఏజీని కోరింది.

తమ ఓపికను పరీక్షించకండంటూ పిటిషనర్లను ఉద్దేశించి హైకోర్టు సున్నితంగా హెచ్చరించింది. గంటలకొద్దీ ఒకే అంశం ప్రస్తావించి, తమ సమయాన్ని వృథా చేయొద్దని చెప్పింది. జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ.. సోమ, మంగళవారాల్లో పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.