09-10-2025 01:35:12 AM
* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ జారీచేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో రాజకీయం వేడిక్కింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును గెలుపొందడం బీఆర్‌ఎస్ పార్టీకి కీలకంగా మార డంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగారు.
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): గతంలో ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ వంటి ఎన్నికల్లో ఎవరికి వారుగా బాధ్యత నిర్వర్తించిన కేటీఆర్, హరీశ్‌రావు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి కట్టుగా వ్యూహరచన చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి పుంజుకోవడంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కీలకంగా మారనుంద ని భావిస్తున్న నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు ఈ ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూ, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తు న్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.
అయితే అధి కారం కోల్పోయాక పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, క్యాడర్‌లో నెలకొన్న నైరాశ్యాన్ని పటా పంచలు చేసేందుకు వారు కలిసి ముందడుగు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను సమష్టిగా పంచుకోవడం ద్వారా అటు కార్యకర్తలకు, ఇటు ప్రజలకు స్పష్టమైన సంకేతాలిచ్చేలా కేటీఆర్, హరీశ్‌రావు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి నుంచి మరో లెక్క..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయా క బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పెద్దగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు. అయినప్పటికీ ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్‌రావు పార్టీ వ్యవహారాలను, క్యాడర్‌ను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతు న్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి బీఆర్‌ఎస్ బలాన్ని చూపించాల్సిన నేపథ్యంలో కేటీఆర్, హరీష్‌రావు కలిసి కట్టుగా వ్యూహ రచన చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో స్పష్టమైన విజయం సాధించడంపై దృష్టి సారించారు. ఇప్పటివరకు వేర్వేరుగా పలు ఉప ఎన్నికలను నిర్వహించిన అనుభవం కేటీఆర్, హరీష్‌రావులకు ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం కావడంతో బీఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యతను ఇరువురు భుజాలకెత్తు కున్నారు. బీఆర్‌ఎస్‌లో ట్రబూల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావు గతంలో ఇంచార్జీగా ఉండి ముందుకు నడిపించిన హుజురాబాద్, దుబ్బాక వంటి ఉప ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ, నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా చేశారు.
అర్బన్ ఓటర్లను అత్యంత ప్రభావితం చేసిన కేటీఆర్, గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించేందుకు కృషి చేశారు. దీంతోపాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ కేటీఆరే బాధ్యత వహించి, అక్కడ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సమర్థవంతంగా విజయ తీరాలకు చేర్చిన అనుభవం ఉన్న కేటీఆర్, హరీష్‌రావు మొదటిసారి ఒక ఉప ఎన్నికలకు కలిసి బాధ్యత వహిస్తున్నారు.
బీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకం..
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొద్దీ కాలానికే కంటోన్మెంట్‌లో ఉప ఎన్నిక రావడంతో అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ గెలవడానికి అన్ని విధాలా అనుకూలించింది. కానీ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తుంది. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తున్నది. ఈ రెండేళ్లు కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా చూపించడం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలవడంపై బీఆర్‌ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వాస్తవానికి 2014లో టీడీపీ నుంచి గెలుపొందిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అయితే ఇప్పటికే రెండుసార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోవాలని యోచిస్తుంది. దీంతోపాటు ఉప ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంతోపాటు బీఆర్‌ఎస్ తిరిగి పుంజుకున్నదని రాష్ట్రవ్యాప్తంగా గట్టి సంకేతాలు పంపాలని చూస్తుంది.
భవిష్యత్ ఎన్నికలకు బూస్ట్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందడాన్ని కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేయకూడదని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇక్కడ గెలిచేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పట్టు బిగించడానికి, బూత్ నుండి డివిజన్ స్థాయి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది.
ఈ విజయంతో క్యాడర్‌లో మనోధైర్యం నింపడంతోపాటు ప్రజల్లో విశ్వాసం కల్పించాలని యోచిస్తున్నది. తద్వారా త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు, భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ గెలుపొందడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నది. అయితే అధికారం కోల్పోగానే బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో గెలుపొందడం బీఆర్‌ఎస్‌కు ఎంతో అనివార్యంగా మారింది.
జూబ్లీహిల్స్ చేజారిపోతే అంతర్గతంగా చీలికలు రావడంతోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు ఇటీవలి కాలంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావులపై తీవ్రంగా ఆరోపణలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ పరిణామంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొన్నది.
పార్టీపై క్యాడర్‌లో ఉన్న విశ్వాసం సన్నగిల్లేందుకు అవకాశం కల్పించినట్టు అయింది. అయినప్పటికీ పార్టీ అధిష్ఠానం మాజీ మంత్రి హరీష్‌రావు పక్షానే నిలబడింది. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదనే సంకేతం ఇచ్చేందుకు కేసీఆర్ కూతురును సైతం పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బీఆర్‌ఎస్ క్యాడర్‌కు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాల్సిన అనివార్యత బీఆర్‌ఎస్ పార్టీకి ఏర్పడింది.