18-09-2025 01:28:03 AM
హైదరాబాద్, సెప్టెంబర్ ౧౭ (విజయక్రాంతి): తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం, తగ్గిన యూరియా ఉత్పత్తి, అవసరమయ్యే యూరియా కోసం రాష్ట్ర ప్రభుత్వం ముం దుగానే అంచనా వేయకపోవడం, కేంద్రం తెలంగాణకు సరైన సమయంలో, అవసరమైన యూరియాను పంపిణీ చేయకపోవడంతో రైతులపై ముప్పే ట దాడి జరుగుతున్నది.
ఏదైనా పనిమీద దూర ప్రాంతాలకు వెళ్లిన ప్పుడుగానీ, ఆపద సమయంలోగా నీ సమయం చూడకుండా ఇంటినుంచి బయటకు వెళ్లే రైతులు.. ఇప్పుడు యూరియా కోసం కోడి కూయకముందే లేచి సహకార కేంద్రాలు, ఫర్టిలైజర్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. తిండితిప్పలు మానుకుని రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నారు. అయినా కూడా యూరియా దొరకడంలేదు. ఆ రోజు నిరాశతో ఇంటికి వెళ్లిన రైతు మరుసటి రోజైన ఒక్క బస్తా యూరియా దొరుతుందేమోనని తెల్లవారకముందే వెళ్లి క్యూలో నిల్చుంటున్నాడు.
రాష్ట్రంలో గత రెండు నెలలుగా అంటే.. వానాకాలం పంటలు సాగు చేసిన మొదటి రోజు నుంచి ఇదే తంతు కొనసాగుతున్నది. తెలంగాణకు అవసరమయ్యే యూరియాను కేంద్రం సకాలంలో పంపిణీ చేయడంలోనూ విఫలమైంది. కేంద్రం సకాలంలో తెలంగాణకు యూరియా పంపిణీ చేయకపోవడంతోపాటు రాష్ట్రంలో ఎంతమేరకు యూరియా అవసరమో కాంగ్రెస్ సర్కారు అంచనా వేయకపోయలేదు.
రాష్ట్రంలో సాగయిన పంటలు, ఏమేరకు యూరియా అవసరం ఉందో రాష్ట్ర ప్రభు త్వం ముందుగానే అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా జాగ్రత్త పడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రాష్ట్రంలో యూరియా దొరకడం లేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
క్షేత్రస్థాయి అధికారుల విఫలం!
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు యూరియా కొరత, లభ్యతపై రైతులకు సమాచారంగానీ, వివరాలు తెలుపడంలోగానీ విఫలమయ్యారు. తమ ప్రాం తంలో రైతులు ఎంత మేరకు పంటలు సాగు చేశారు, ఏమేరకు యూరియా అవసరమున్నది, ప్రస్తుతం ఎంత దిగుమతి అవుతున్నది వివరంగా రైతులకు చెప్పడం లేదు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌గానీ, జిల్లా వ్యవసాయాధికారిగానీ, మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు యూరియా దిగుమతిపై వివరాలు వెల్లడించడంలేదు.
అధికారుల సమన్వయ లోపమో ఏమోగానీ రైతులు మాత్రం ముందస్తు సమాచారం లేకపోవడంతో పనులన్నింటినీ వదులుకుని క్యూలో నిల్చుంటున్నారు. రాష్ట్రంలో ఏటా సాగు పెరుగుతూ వస్తున్నది. వర్షాలు సమృద్ధిగా పడటం, ప్రాజెక్టులు నిండటం, చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలతో పాటు బోరు బావుల్లో నీరు ఉండటంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది.
సాగయ్యే అన్ని పంటలకు యూరియా అవసరం ఉన్నా.. వరికి మాత్రం యూరియా వినియోగం పెరిగింది. దీనికి కారణం సన్నవడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వడం కూడా కారణంగా మారింది. అధికారుల అంచనాకు మించి వరిసాగడంతోపాటు మిగిలిన పంటల విస్తీర్ణం కూడా పెరిగింది. దీంతో అధికారులు యూరియా ఎంత మేరకు అవసరమో అంచనా వేసినదానికంటే కూడా అవసరత పెరిగింది.