05-01-2026 12:00:00 AM
ఓటర్ల జాబితా ముసాయిదా సిద్ధం..
ఆశావాహూల తహతహ..
కసరత్తు పూర్తి చేసిన అధికారులు
ఇక ఎన్నికల తేదీ ఖరారే ఆలస్యం
ఈనెల 11న వెలువడనున్న ఎన్నికల ప్రకటన..?
పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు
కామారెడ్డి, జనవరి 4 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. పట్టణాలలో మున్సిపల్ పాలకవర్గాన్ని, కార్పొరేషన్లలో పాలకవర్గాల ను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఓటర్ ముసాయిదా తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, లతోపాటు కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు.
మున్సిపల్ కేంద్రాల్లో కౌన్సిలర్ లా, కార్పొరేషన్లలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుపొందేందుకు ఆశావాహులు పావులు కదుపుతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓటరులను మలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసి ఏడాది నర పూర్తి కా ఉండడంతో ప్రభుత్వం ఎన్నికలను ఎప్పుడు ప్రకటిస్తుందో అని ఎదురుచూసిన వారికి ప్రభుత్వం మున్సిపల్ పోరు కు కసరత్తు చేస్తుండడంతో ఆశావాహులు పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
తమకు అనుకూలమైన వార్డు రిజర్వేషన్ కలిసి వస్తుందా లేదా తెలియక ముందే పోటీ చేసేందుకు మాత్రం ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కౌన్సిలర్ గా పోటీచేసి తమ రాజకీయ భవిష్యత్తును తేల్చుకునేందుకు పలువురు ఆశావాహులు, ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు తాజా మాజీ కౌన్సిలర్లు మళ్లీ పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. మరికొందరు యువత కొత్తగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీలో కమ్యూనిటీ బోర్ లో సభ్యత్వం ఉన్న వారిని కలిసి తమకు రిజర్వేషన్ కలిసివస్తే ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేస్తానని తనకు మద్దతు ప్రకటించాలని ఇప్పటి నుంచే ఆశావా హూ లు కోరుతున్నారు.
రాజకీయ పార్టీలు ప్రయత్నాలు షురూ..
పట్టణాల్లో కాంగ్రెస్, టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు చెందిన తమ అనుచరులను పోటీలో నిలబెట్టి గెలిపించాలని పలువురు పార్టీల పెద్దలు భావిస్తున్నారు. వారి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులే గెలిపించుకునేలా రాజకీయ పార్టీలు పావులు కదుపు తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నేతలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని పట్టణ కేంద్రాల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు బి ఆర్ ఎస్, బిజెపి లు సైతం మున్సిపల్ లలో తమ జెండాను ఎగరవేసేందుకు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కసరతులు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని వాటిని ప్రజలకు వివరించి ఓట్లు అడిగేలా ప్రతిపక్ష పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు.
10న తుది ఓటరు జాబితా విడుదల..
ఈనెల 10న పట్టణ కేంద్రాల్లో ఓటర్ తుది జాబితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారులు మునిసిపల్ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలను సిద్ధం చేసి ఆయా మున్సిపల్ కేంద్రాల్లో ఈనెల 10న విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు పూర్తి చేశారు. తుది ఓటరు జాబితా విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. మరుసటి రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని వినిపిస్తున్నాయి.
ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికలు..?
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద పట్టణ కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు తూది ఓటర్ జాబితాలను సిద్ధం చేశారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తేదీలను ప్రభుత్వం ప్రకటించనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల ప్రకటనను ప్రభుత్వం ప్రకటిస్తే ఈ నెల చివరిలోగా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రకటన విడుదల చేయగానే ఎన్నికల నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
సర్పంచుల ఎన్నికల తర్వాత ఎంపీటీసీలు జడ్పిటిసిలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని భావించిన ప్రభుత్వం పట్టణ కేంద్రాల్లో మున్సిపల్, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు ముగ్గు చూపుతుంది. దాంట్లో భాగంగానే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముందుగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన తర్వాత ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ఏది లను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.
పట్టణ కేంద్రాల్లో తుది ఓటరు జాబితా సిద్ధం చేశాం..
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ,ఎల్లారెడ్డి, బిచ్కుంద పట్టణ కేంద్రాల్లో తుది ఓటరు జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. ఈనెల 10న ప్రభుత్వము ఆదేశాలు జారీ చేస్తే తుది ఓటరు జాబితాలను మున్సిపల్ కేంద్రాల్లో విడుదల చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేసాం. పోలింగ్ బూత్ల వివరాలు ఎన్నికల సామాగ్రి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, వాహనాలు కావాల్సిన సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశాం.
ఆశిష్ సంగు వాన్, కామారెడ్డి కలెక్టర్