13-01-2026 10:09:47 AM
- అధికారుల నిర్లక్ష్యంతో ఆశావహుల ఇబ్బందులు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలో ఓటర్ ముసాయిదా తుది జాబితా వ్యవహారం వివాదాస్పదమైంది. అధికారికంగా అందుబాటులో ఉండాల్సిన ఓటర్ లిస్ట్‌లు ఒకే ఒక్క జిరాక్స్ సెంటర్ కి పరిమితం కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాఫ్ట్ కాపీ ఇవ్వడం కుదరదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తుండగా సదురు ప్రైవేట్ జిరాక్స్ సెంటర్ లో మాత్రం సాఫ్ట్ కాపీ ద్వారా అధిక ధరకు జిరాక్స్ సెట్లను ఇస్తుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
రాజకీయ ఆశావహులు, అభ్యర్థులు, కార్యకర్తలు పత్రాల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటర్ లిస్ట్‌లు ప్రజాస్వామ్యానికి మౌలిక మైనవి కాగా, వాటిని అందరికీ సమానంగా, పారదర్శకంగా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం అసౌకర్యాలు, అనుమానాలు, అవకతవకలకు తావిస్తోందనే విమర్శలున్నాయి. తక్షణమే ప్రతి వార్డు ఓటర్ ముసాయిదాను ఆన్‌లైన్‌లో ఉచితంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ అంశం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.