13-01-2026 10:12:05 AM
అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంది
బాధిత కుటుంబాలకు బరోసా
నంగునూరు,విజయక్రాంతి: అప్పుల బాధతో రైతులు ప్రాణాలు తీసుకోవద్దని,ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు.సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ఘనపూర్ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఎల్ల రాజిరెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.రాజిరెడ్డి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే రైతు బీమాతో పాటు తన వ్యక్తిగత సహాయంగా రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.కుమారుడికి ప్రైవేట్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
గుండెపోటుతో మరణించిన అదే గ్రామానికి చెందిన రాములు కుటుంబానికి కూడా రూ. 3 లక్షల సాయం అందిస్తూ,వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని మంత్రి గుర్తు చేశారు. రైతులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని,ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని ఆర్డీఓ సదానందాన్ని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తదితరులు పాల్గొన్నారు.