02-05-2025 12:00:00 AM
ఎల్బీనగర్, మే 1 : ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో నాకు ప్రాణ హాని ఉందని, తనపై బహిరంగంగా బెదిరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన చేశానన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కు పార్టీ నాయకుడిగా ఆమె చేస్తున్న న్యాయం పోరాటానికి తాను మద్దతు ఇస్తే ఎమ్మెల్యే సహించలేకపోతున్నారని తెలిపారు. ఈ బీఎన్ రెడ్డి నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనపై బహిరంగంగా బెదిరించారని తెలిపారు.
తనకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధ్యత వహించాలని, ఆయనతో తనకు ప్రొణ హాని ఉందని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీసులను చంద్రశేఖర్ రెడ్డి కోరారు.