22-07-2025 01:26:44 AM
నిజామాబాద్ జిల్లా : అక్షరాలను తూటాలుగా మలిచి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో కీలకపాత్ర వహించిన వారు దాశరథి కృష్ణమాచార్యులు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచారు. అయితే ఆయన కలం నుంచి జాలువారిన ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అన్న పదునైన వాక్యానికి ఎంతో చరిత్ర ఉంది.
నిజాం రాజుకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో 1948లో నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లాలోని జైలులో దాశరథి శిక్షను అనుభవించారు. అప్పుడు మహాకవి, తెలంగాణ పోరాట యోధుడు వట్టికోట అళ్వారు స్వామి సైతం అదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరూ ఒకే బ్యారక్‌లో ఉన్నారు. తమ నైపుణ్యానికి పదునుపెట్టి, అనేక రచనలకు పూనుకున్నారు.
ఈ సందర్భంగానే పెన్ను, పేపరు లేకపోయినా దాశరథి కృష్ణమాచార్యులు బొగ్గు ముక్కతోనే జైలు గోడలపై ‘ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని.. తీగలను దెంపి అగ్నిలో దింపినావు.. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని రాశారు. ఈ నినాదం అనేక తెలంగాణవాదుల మెదళ్లను తాకింది. 1949లో దాశరథి రచించిన అగ్నిధార కావ్యాన్ని ప్రచురించగా, ఇందులో కనీసం సగం కవితలు ఈ జైలు గోడలపై రాసినవి కావడం విశేషం.
వట్టికోట ఆళ్వారుస్వామి 1955లో ప్రచురించిన ప్రజల మనిషి నవలలో హీరో కంఠీరవం జైలు జీవితాన్ని తెలియజెప్పిన ఒక అధ్యాయం కూడా ఇక్కడి అనుభవాలే. వట్టికోట రాసిన ‘జైలు లోపల’ అనే కావ్య సంపుటిలోనూ ఆయన స్వీయ జైలు అనుభవాలు ఉన్నాయి. 1948, జనవరి 30వ మహాత్మా గాంధీ మరణించినప్పుడు క్షమామూర్తి అనే సంస్మరణ పద్యాన్ని దశరథి ఇదే జైలులో రాశారు.
ఇంతటి చరిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఈ జైలు అభివృద్ధిపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని కవులు, తెలంగాణ ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చ్‌పభు త్వం జైలును దాశరథి స్మృతివనంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
జీ ప్రమోద్,