calender_icon.png 14 February, 2026 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫలించిన మైనంపల్లి అభివృద్ధి మంత్రం

14-02-2026 08:34:24 PM

ఎన్నికల ప్రచారంలో జోష్ నింపిన మైనంపల్లి పర్యటనలు

పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని గట్టి హామీ

తనను నమ్మి ఓట్లు వేయాలని కోరిన మైనంపల్లి హనుమంతరావు

 కాంగ్రెస్ వైపు మొగ్గుచూసిన పట్టణ ఓటర్లు

రామాయంపేట: రామయంపేట మున్సిపల్ ఎన్నికల ను అధికార కాంగ్రెస్ పార్టీ ఒక సవాలుగా తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఈ ఎన్నికలను చాలెంజిగా తీసుకోవడం జరిగింది. నామినేషన్ల మొదలుకొని ప్రచారం ముగిసే వరకు ప్రతిరోజు మున్సిపాలిటీలో ఉండడంతోపాటు ప్రతి వార్డులో ఇంటింటా తిరుగుతూ అభ్యర్థుల తరఫున ప్రచారాలు ముమ్మరం చేశారు. ఎక్కడ కూడా విమర్శకులకు తావివ్వకుండా తమదైన శైలిలో అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు వివరించడం జరిగింది.

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రతి వార్డులో తిరుగుతూ గతంలో తనను ఆదరించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అలాగే తనపై నమ్మకం ఉంచి అభ్యర్థులను గెలిపిస్తే రామాయంపేట ను రాష్ట్రంలోని ఉత్తమంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

రామయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మైనంపల్లి ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కూడా ప్రతిపక్షాల గురించి ఎక్కువ మాట్లాడకపోవడం, కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడడం  ఎన్నికల ఫలితాలకు అనుకూలంగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులు ఇప్పుడైనా ప్రారంభమవుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

ఆచితూచి అభ్యర్థుల ఎంపిక

కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ అభ్యర్థులు చాలామంది బీఫామ్ కోసం ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ పూర్తి సర్వే అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. కొంతమంది నిరుత్సాహపరులు రెబల్గా నామినేషన్లు వేసిన తగిన ఓట్లు రాలేదు. అలాగే ఎక్కడ కూడా అభ్యర్థులకు రెబల్ అభ్యర్థుల నుండి, ప్రతిపక్ష అభ్యర్థుల నుండి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు హనుమంతరావు అందుబాటులో ఉండడంతో పాటు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా మహిపాల్ రెడ్డిని నియమించి ఇప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో అభ్యర్థుల కంటే ఎక్కువ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ రాహుల్ ఎక్కువ కృషి చేయడం గమనార్హం.