3 July, 2026 | 1:28 AM

బీఆర్‌ఎస్ గూండాగిరికి భయపడం

03-07-2026 12:39 AM
  1. ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమ 
  2. తీరు మారకపోతే అడ్రస్ గల్లంతే
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : -బీఆర్‌ఎస్ నేతల గూండాగిరికి, బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిని అవినీతిని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఆధారాలతో సహా బయటపెట్టారని, ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని హెచ్చరించారు.

ఇంకా అధికారంలోనే ఉన్నామని, లేదంటే మళ్లీ  అధికారంలోకి వస్తామనే భ్రమలో బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారని విమర్శించారు. ఏ అంశంపై అయినా సరే.. అసెంబ్లీ వేదికగా చర్చకు వస్తే తేదీ ఖరారు చేస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేతలు తమ పదేళ్ల పాలనలో అంటించుకున్న బురదను.. తమ ప్రభుత్వానికి, మంత్రులకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఐదేళ్ల పాలనకు ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడితే.. రెండున్నరేళ్లకే గద్దె దిగమని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో, ఎలాంటి తీర్పులు వచ్చాయో రాష్ట ప్రజలకు, దేశానికి తెలుసన్నారు. ప్రభుత్వ శాఖల్లో పిలిచిన టెండర్ మొత్తం కంటే మూడునాలుగు రెట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.

వారి ప్రవర్తన మారకపోతే రానున్న కాలంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పుల అంశంపై బీఆర్‌ఎస్ సవాల్‌ను స్వీకరించి మంత్రులు గన్‌పార్క్ వద్దకు వెళ్తే.. ఆ పార్టీ నాయకులు రాకుండా పరారయ్యారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. మంత్రులు గన్‌పార్క్ వద్దే గంట పాటు వేచి చూశారని, నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని  హితవు పలికారు.