17 August, 2026 | 4:55 PM

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

17-08-2026 03:50 PM

హుజురాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలను భక్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నాగ దేవతలను పూజిస్తే సుఖసంతోషాలు, సంతానం, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసించిన భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హుజురాబాద్ పట్టణంలోని నాగేంద్రస్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలోని పుట్ట వద్ద పాలు పోసి, పండ్లు, పూలు తదితర నైవేద్యాలను సమర్పించి నాగ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. పట్టణంలోని పలు శివాలయాలు సైతం భక్తులతో కిటకిటలాడాయి.

సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లెలోని సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

అలాగే హుజురాబాద్ డివిజన్ పరిధిలోని సైదాపూర్, కేశవపట్నం, వీణవంక, ఇల్లంతకుంట తదితర మండలాల్లోని నాగ దేవత ఆలయాలు, పుట్టల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. పాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో నాగ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలిచారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల క్షేమం, సుఖసంతోషాల కోసం మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆయా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకతో పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.