07-07-2025 12:35:32 AM
ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): దేశ స్థాయిలో ఏర్పడుతున్న పొలిటీషియన్స్ జేఏసీ తెలంగాణ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ నాగుల శ్రీనివాస్ యాదవ్ ను వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నాగుల శ్రీనివాస్ యాదవ్ ను నాయకులు గొల్లపల్లి దయానంద్ రావు, పద్మారావు, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, బోయ గోపి, మల్లం రమేష్, చీమల జగదీశ్ తదితరులు గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన వివిధ సంఘాల ప్రతినిధుల రాష్ట్ర స్థాయి సమావేశంలో నాగుల శ్రీనివాస్ మాట్లాడారు.
2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డ ఉద్యమకారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ రాజకీయ క్షేత్రంలో అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు, అన్న అంశాలతో ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ కారులకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, తెలంగాణ రావడం కోసం ధన, ప్రాణ త్యాగం చేసిన వారికి 2014 నుండి 2023 వరకు ఎటువంటి లాభం జరగలేదన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉంటూ అప్పటి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రలు వహించిన వివిధ వ్యవస్థల నాయకులు అందరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ క్షేత్రంలో, ప్రభుత్వంలో, మనకు కూడా పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో దేశ స్థాయిలో ఏర్పడుతున్న పొలిటీషియన్స్ జేఏసీ తెలంగాణ విభాగాన్ని తయారు చేసుకున్నామని అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులను నియమిస్తామని అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ తెలిపారు.