07-07-2025 12:36:57 AM
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణపై సదస్సులో పలువురు వక్తలు
ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): మహిళా ఉద్యోగులు మహిళల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహనను పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో, పని ప్రదేశాలలో వారిపై జరుగుతున్న లైంగిక వైధింపులను తిప్పకొట్టాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ’పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ’ అంశంపై సదస్సు ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్(ఐబిఇయు, ఎపి, టిఎస్) ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడ తాజ్ మహల్ హోటల్ లో ఐబిఇ యు, ఎపి, టిఎస్ చైర్మన్ కె.రాధాకృష్ణ అధ్యక్షత జరిగింది.
ఈ సదస్సులో మహిళలపై లైంగిక వేధింపులు ఆపాలని అవగాహన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్(ఐబిఇఎ) జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాం బాబు, ఇండియన్ బ్యాంక్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఫీల్ జనరల్ మేనేజర్ ప్రణీష్ కుమార్, ఎపిటిబిఇఎఫ్ అధ్యక్షులు టి.రవీంద్రనాథ్, ఐబిఇయు, ఎపి, టిఎస్ ప్రధాన కార్యదర్శి పి.వి.కృష్ణారావు, ఇండియన్ బ్యాంక్ మల్కాజ్గిరి జోనల్ మేనేజర్ స్వర్ణ ప్రవ సుందరే,
ఎపిటిబిఇఎఫ్ మహిళా విభాగం కన్వీనర్ కె.వి.స్వాతి, ఐబిఇయు, ఎపి, టిఎస్ మహిళా కన్వీనర్ జి.పద్మ హాజరై మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగులు ధైర్యంగా పనిచేసే పరిస్థితులను, వాతావరణాన్ని కల్పించే బాధ్యత సంబంధిత యాజమాన్యాలపై ఉందన్నారు. రాజ్యాంగం, చట్టాల ప్రకారం ప్రజలందరికీ సమాన హక్కులు ఉన్నాయని, ఎవరి పరిమితుల్లో వారు ఉండాలని, సమాజంలో ఎవరిని అవమానించే హక్కు ఎవరికీ లేదని వక్తలు స్పష్టం చేశారు.