17-09-2025 12:53:28 PM
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలు మెచ్చిన విధంగా ప్రజాపాలన సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(Whip Dr. Jatoth Ramachandru Naik) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో బుధవారం ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ. 500 కే వంటగ్యాస్ సిలెండర్ పంపిణీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకము, రైతన్నలకు రూ. 2 లక్షల వరకూ రుణ మాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు మంజూరు, అదనంగా కుటుంబ సభ్యుల నమోదు, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భీమా, విద్యా వ్యవస్థను మెరుగు పరచడానికి ‘తెలంగాణ విద్యా కమిషన్’ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
అంగన్వాడిలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చడంతో పాటు ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నామని, జిల్లాలో 1,040 పాఠశాలలల్లో సుమారు 97,043 మంది విద్యార్ధులు చదువుతున్నట్లు చెప్పారు. 2024-2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఫలితాలు 99.29 శాతం సాధించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు గత సంవత్సరం నుండి కాస్మోటిక్, చార్జీలు 200 శాతం, డైట్ చార్జీలు 40 శాతం పెంచినట్లు చెప్పారు.
పరిశ్రమలు, వాణిజ్య శాఖ ద్వారా యువతకు ఎటువంటి ఖర్చు లేకుండా వారి ఉపాధిని పెంపొందించడం ద్వారా వారిని శక్తివంతం చేయడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిని ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో పాలనను బలోపేతం చేయడానికి, ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడం కొరకు ప్రభుత్వం ప్రతీ రెవెన్యు గ్రామానికి గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 180 క్లస్టర్ లకు గాను 179 గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. రాబోవు కాలంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత పారదర్శకంగా సులభతరంగా ప్రజలకు అందించి, ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కే. అనిల్ కుమార్, జిల్లా పుర ప్రముఖులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.