calender_icon.png 17 September, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ: నిర్మలా సీతారామన్

17-09-2025 01:34:03 PM

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణపై(GST Reforms 2025) విశాఖ మధురవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని తెలిపారు. నాలుగు స్లాబ్ లనుంచి రెండు స్లాబ్ లకు తగ్గించామని సూచించారు. 12 శాతంలో ఉండే వస్తువులు దాదాపు 99 శాతం 5 పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. 28 స్లాబ్ లో ఉండే వస్తువులు దాదాపు 90 శాతం 18కి వచ్చేశాయని సూచించారు. 28 స్లాబ్ లో ఉండే సిమెంట్ 18 స్లాబ్ పరిధిలోకి తీసుకువచ్చామని వెల్లడించారు. 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమలులోకి వస్తాయని సూచించారు.

కారు, ఫ్రిజ్ ఏసీ వంటివన్నీ 28 నుంచి 18 శాతానికి తీసుకొచ్చామని ఆమె పేర్కొన్నారు. 2017 కు ముందు 17 రకాల పన్నులు ఉండేవి.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవి అన్నింటినీ కలిపి జీఎస్టీ(Goods and Services Tax) దేశవ్యాప్తంగా ఒకే పన్ను, నాలుగు స్లాబ్ లకు తీసుకొచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2017 కు ముందు ఉదాహరణకు సబ్సు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదన్నారు. అప్పుడు 64 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లని తెలిపారు. ఈ 8 ఏళ్లలో రాష్ట్రాల సహకారంతో 1.51 కోట్లకు చెల్లింపు దారులు పెరిగారని తెలిపారు. 2018 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ. 7.19 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని, 2025 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ. 22.08 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. పాలు, పెరుగు వంటివన్నీ 5 స్లాబ్ నుంచి సున్నా శాతానికి తీసుకొచ్చామని తెలిపారు. నిత్యావసరాలన్నీ పప్పులు, ఉప్పు, చింతపండు, నెయ్యి, వెన్న, వంటపాత్రలు వంటివి 12 నుంచి 5 శాతానికి వచ్చేశాయని పేర్కొన్నారు. హెయిర్ ఆయిల్, షాంపూ వంటివి 18 నుంచి 5 శాతానికి వచ్చేశాయన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.