17-09-2025 12:48:33 PM
హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్ర ఏర్పాటులో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Union Minister Bandi Sanjay) ప్రముఖ పాత్ర పోషించారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ( Telangana Liberation Day) కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. నిజాం నిరంకుశ పాలన తలచుకుంటే ప్రజల రక్తం మరుగుతుందని తెలిపారు. ఉర్దూను ప్రజలపై రుద్దేందుకు నిజాం ప్రయత్నించారని బండి సంజయ్ ఆరోపించారు. నిజాం.. బలవంతపు మత మార్పిడులు చేశారని తెలిపారు. మతం మారని వారికి ఎక్కువ పన్నులు వేసి ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఈ సంస్థానం ప్రాముఖ్యత ఊహించే నిజాం మెడలు వంచారని చెప్పారు. అమిత్ షా చొరవతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే రాష్ట్ర పాలకులు అధికారికంగా జరపడం లేదని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక గల్లీగల్లీలో జాతీయ జెండా ఎగరవేస్తామని తేల్చిచెప్పారు.
తెలంగాణ జలియన్ వాలాబాగ్(Jallianwala Bagh) లాంటి అనేక మారణహోమాలను చూసిందని బండి సంజయ్ గుర్తుచేసుకున్నారు. లెక్కలేనన్ని అమరవీరులు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. హైదరాబాద్‌ను నిజాం పాలనలో ఉంచడం భారతమాత కడుపులో క్యాన్సర్ లాంటిదని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పష్టంగా చూశాడు. ఆయన కుట్రను అణిచివేసి తెలంగాణను విముక్తి చేసి, భారతదేశంలో కలిపారు. లేకపోతే, ఈ రోజు ఇక్కడ ఎలాంటి ముస్లిం రాజ్యం పరిపాలించేదో ఊహించుకోండన్నారు. సర్దార్ పటేల్ లేకుండా, తెలంగాణ మరొక పాకిస్తాన్, మరొక శ్రీలంక, మరొక బంగ్లాదేశ్ లా ఆకలి, గందరగోళంతో నలిగిపోయేదని స్పష్టం చేశారు. మనకు, ఆయన ఎప్పటికీ నిజమైన విముక్తిదారుడిగా ఉంటారని బండి సంజయ్ పేర్కొన్నారు. విమోచన దినోత్సవాన్ని సమర్థించే నైతిక హక్కు బీజేపీకి మాత్రమే ఉందని తెలిపారు. అంతకు ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విమోచన దినోత్సవ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ అంజి రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తూళ్ళ వీరేందర్ గౌడ్, వేముల అశోక్, ఎన్.గౌతం రావు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, తెలంగాణ విమోచన దినోత్సవ కమిటీ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.