పెద్దమల్లారెడ్డిలో జాతీయ పక్షికి ప్రాణదానం
05-03-2026 12:27 AM
భిక్కనూర్, మార్చి 4, (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ పరిధిలోని చెరువు కట్ట సమీపంలో బుధవారం రైతు పొలంలో నెమలి మందు కలిసిన నీటిని తాగి అపస్మారక స్థితికి చేరిన ఘటన చోటు చేసుకుంది. గమనించిన రైతు వెంటనే గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్కు సమాచారం అందించారు. సర్పంచ్ తక్షణమే స్పందించి వెటర్నరీ డాక్టర్కు తెలియజేయడంతో పాటు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కామారెడ్డి నుంచి వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దీపిక ఆధ్వర్యంలో నెమలికి చికిత్స అందించారు. చికిత్స ఫలితంగా నెమలి కోలుకోవడంతో అనంతరం అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. సమయానుకూల చర్యలతో నెమలికి ప్రాణాలు దక్కాయని గ్రామస్తులు అభినందించారు.




