06-05-2025 05:14:29 PM
నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తాం..
మంథనిలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సత్వరమే అందుబాటులోకి తీసుకొనిరావాలి..
మంథని ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
మంథని (విజయక్రాంతి): వరంగల్-మంచిర్యాల జాతీయ రహదారి సి.ఎన్.జి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మంథని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంథని మండలంలోని వేంపాడు గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులు, పుట్టపాక గ్రామం, మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఏక్లాస్ పూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మంథని పట్టణం పాత పాల కేంద్రంలో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... వరంగల్-మంచిర్యాల జాతీయ రహదారికి సంబంధించి జరుగుతున్న సీ.ఎన్.జి పనులను వేగవంతం చేయాలని, 3 రోజుల వ్యవధిలోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. యాసంగి పంట సీజన్ లో రైతులు పండించిన నాణ్యమైన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలు రాగానే కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాటు చేశామన్నారు.
మంథనిలో కుట్టు మిషన్ కేంద్రం 3 రోజుల్లో అందుబాటులోకి..
మంథని పట్టణ ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ అందించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న ట్రైనింగ్ సెంటర్ 3 రోజులలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు.
రామగిరిలో రహదారి పనులు వేగవంతం చేయాలి..
అనంతరం రామగిరి మండలంలోని ఆదివారం పేట గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి సీ.ఎన్.జి పనులను కలెక్టర్ పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా సహకార అధికారి శ్రీ మాల, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, మంథని తహసిల్దార్ కుమారస్వామి, రామగిరి తహసిల్దార్ సుమన్, ఏడిఎం అంజని, ప్యాక్స్ సీఈఓ అశోక్, ఏపిఎం పద్మ, ఏఈ మౌనిక, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.