calender_icon.png 6 May, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిహారంలో వివక్ష..?

06-05-2025 05:08:51 PM

వికాస్ కు ఒక న్యాయం.. నర్సయ్యకో న్యాయమా?

కార్మిక సంఘాలను ప్రశ్నిస్తున్న కార్మికులు..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): సింగరేణిలో చావుల్లో, పరిహారంలో వివక్షత నెలకొంది. ఇటీవల ఆర్జీ వన్ ఓసీపీ-5లో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి మృతి చెందిన వికాస్ కుటుంబానికి రూ.42 లక్షల పరిహారం అంగీకారానికి జాతీయ సంఘాలు ఆందోళన చేశాయి. చివరకు కంపెనీ, కాంట్రాక్టర్ దిగివచ్చి ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని ఐఎన్టియుసీ గొప్ప విజయంగా చెప్పుకుంటుంది. ఇదే క్రమంలో మంగళవారం బెల్లంపల్లి ఏరియా గోలేటి వన్ లో తేనెటీగల దాడిలో మృతి చెందిన పుప్పాల నరసయ్య కుటుంబానికి అవే కార్మిక సంఘాలు రూ. 3 లక్షల పరిహారానికి సరిపెట్టుకున్నారు.

ఇద్దరు కంపెనీ పురోగతి కోసం వేర్వేరు రంగాల్లో పనిచేసిన కార్మికులే. ఇద్దరిచావులు, ప్రాణాలకు ఒకే తీరు విలువ ఉంది. కానీ కార్మిక సంఘాలు, కంపెనీ పరిహారంలో వ్యత్యాసం, వివక్ష చూపించడం పట్ల విమర్శలు పెల్లు బికుతున్నాయి. సింగరేణి ప్రాంతంలో రామగుండం, బెల్లంపల్లి ఏరియాలు రెండు కూడా కంపెనీ పరిధిలోనివే. కాంట్రాక్టు రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు ప్రాంతాల వారీ విలువ ఉండడం పరిహారంలో వ్యత్యాసాన్నీ రెండు సంఘటనలు తేటతేల్లం చేస్తున్నాయి. రామగుండం 5 ఓబీ పనుల వెలికితీత పీస్ పటేల్ కంపెనీ ఓబీ పనులు, బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సివిల్ పనుల నిర్వహణ కాంట్రాక్టర్ పైడి రాజు నిర్వహిస్తున్నారు.

ద్దరు కాంట్రాక్ట్ కార్మికులు అయినప్పటికీ వారి ప్రాణాలకు ప్రాంతాల బట్టి వెలగట్టడం కంపెనీ కాంట్రాక్టర్ల ద్వంద్వ నీతిపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మిక సంఘాల్లో కార్మికుల పట్ల విక్షపూరిత వైఖిరీనీ కార్మికులు తప్పుపడుతున్నారు. కార్మిక కుటుంబాల జీవితాలతో కంపెనీ, కార్మిక సంఘాలు చెలగాటమాడుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ అటు యజమాన్యం, ఇటు కాంట్రాక్టర్లు న్యాయపూరితంగా వ్యవహరించాలి. ఈ రెండు సమూహాలు కార్మికులకు అన్యాయం చేసినప్పుడు కార్మిక సంఘాలు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేయాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేసే విషయంలో ఒకే విధానం కలిగి ఉండాలి. ప్రాంతానికో న్యాయం, విధానం కార్మిక సంఘాలు అమలు చేయడం సరికాదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ప్రమాదలు జరిగి కార్మికులు మరణించిన ఘటన స్థలికి జాతీయ సంఘాల పెద్ద నాయకులు నిష్పక్షంగా వెళ్లాలి. ఒక ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతంలోని చనిపోయిన కుటుంబానికి ఒక న్యాయం చేయకూడదు. కార్మికుల ప్రాణానికి సమాన విలువ, పరిహారం సమానత్వాన్ని పాటించాలి. ఆర్ జీ వన్ లో ప్రమాదంలో చనిపోయిన కార్మికునికి న్యాయం చేయడానికి ఐ ఎన్టీయూసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ అధినేత రియాజ్ అహ్మద్ వంటి పెద్ద నాయకులు ముందుండి వికాస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. మరి ఇలాంటి ప్రమాదంలో చనిపోయిన గోలేటి కాంట్రాక్ట్ కార్మికునీ విషయంలో ఏమైందని కార్మిక సంఘాలను ప్రశ్నిస్తున్నారు.

గోలేటిలో తేనెటీగల దాడిలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి పరిహారం కోసం పెద్ద నాయకులు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు కార్మిక సంఘాల నాయకులు సమాధానం చెప్పాలి. కార్మికునీ  కుటుంబానికి పరిహారం డిమాండ్ తో పాటు మానవత్వం గా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జాతీయ సంఘాల పెద్ద నాయకుల ప్రధాన విధి. కానీ నరసయ్య విషయంలో జాతీయ సంఘాలు వివక్షపూరితంగా కపటబుద్దితో వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకంటే తార్కాణం మరొకటి అవసరం లేదు. ఐఎన్టీయూసీ అగ్ర నాయకుడు రామగుండంలో మృతుని కుటుంబానికి నష్టపరిహారం గరిష్ట స్థాయిలో సాధించి గొప్ప విజయంగా చెప్పుకుంటున్నారు.

మరి బెల్లంపల్లి ఏరియాలో తేనెటీగల దాడిలో మృతి చెందిన నరసయ్య విషయంలో ఏం చెప్తారో కార్మిక సంఘాలను కార్మికులు, బాధిత కుటుంబాలు నిలదీస్తున్నాయి. ఇప్పటికైనా నరసయ్య కుటుంబానికి రామగుండం ఓపెన్ కాస్ట్ లో మృతి చెందిన వికాస్ కుటుంబానికి ఇవ్వనున్న పరి హారం ఒప్పందాన్ని అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నరసయ్య కుటుంబంలో ఒకరి ఉద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లించాలి. ఈ దిశగా జాతీయ కార్మిక సంఘాల పెద్ద నాయకులు నిజాయితీగా కృషి చేయాలని కార్మికుల కోరుతున్నారు.