02-01-2026 10:02:01 PM
చివ్వెంల,(విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చివ్వెంల పోలీసులు ఖమ్మం జాతీయ రహదారి వెంట వట్టి ఖమ్మంపాడు స్టేజి, ఐలాపురం స్టేజీల వద్ద రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు రోడ్డు భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై పోలీసులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చివ్వెంల ఎస్సై మహేష్ మాట్లాడుతూ... వాహనదారులు ముందుజాగ్రత్తలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వేగ నియంత్రణతో పాటు రహదారి నియమాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఎస్సై హెచ్చరించారు.