02-01-2026 11:17:50 PM
త్వరలో కేసీఆర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు
కదిలించిన ‘విజయక్రాంతి’ కథనం
వంటేరు ప్రతాప్ రెడ్డి బుజ్జగింపులు
గజ్వేల్, జనవరి 2: గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ ఫండ్ అభ్యర్థులందరికీ అందకపోవడంపై దుమారం రేగుతుంది. ఈ మేరకు విజయక్రాంతిలో వరసగా వచ్చిన వార్త కథనాలతో సర్పంచుల్లో చర్చ కొనసాగుతుంది. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన తమకే పార్టీ నాయకులు మోసం చేశారంటూ మండిపడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ సర్పంచ్లను విజయ క్రాంతి కథనం కదిలించింది. రూ.2 కోట్ల పార్టీ ఫండ్ వచ్చిన తమకు రూపాయి కూడా అందలేదని బిఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఒకరితో ఒకరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. తమకు పార్టీ కేటాయించిన ఫండ్‌ను ఇవ్వాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డిపై ఒత్తిడి తీసుకురాగా ఆయన వారిని త్వరలో పార్టీ ఫండ్ ఇస్తామని బుజ్జగించినట్లు వినికిడి.
గత రెండు రోజులుగా పార్టీ ఫండ్ వస్తుందని ఎదురుచూసిన ఆయా సర్పంచ్లకు నిరాశ ఎదురయింది. దీంతో తమకు కేటాయించిన ఫండ్ ను ఇప్పించాలని జగదేవపూర్ మండల బిఆర్‌ఎస్ సర్పంచులు త్వరలో మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కేసీఆర్ ను కలవనున్నట్టు తెలిసింది. ఇంత జరుగుతున్న పార్టీ వర్గాల్లో పార్టీ ఫండ్ గురించి ఏర్పడ్డ అనుమానాలను అధిష్టానం తీర్చకపోవడంతో ఆయా సర్పంచులు అంతా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ తోనే మాట్లాడి తేల్చుకుంటావని బి ఆర్ ఎస్ సర్పంచులు చర్చించుకుని సిద్ధమయ్యారు. కెసిఆర్ వారికి ఎలాంటి సమాధానం ఇస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.