02-01-2026 10:16:35 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. దాంట్లో భాగంగా మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు ఏస్థాయిలో నిర్మాణాలు చేపట్టారో క్షేత్రస్థాయిలోకీ వెళ్లి మండల ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు చేపట్టలేనివారికి పలు సూచనలు సలహాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని సూచించారు. విడతలవారీగా వచ్చే బిల్లులో సమస్యలు ఉంటే పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరు పనులు ప్రారంభించి నాణ్యతతో చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయిలు, పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డ్ మెంబర్లు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.