05-05-2025 04:27:47 PM
మందమర్రి (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఉదారి చంద్ర మోహన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్ లు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశ వ్యాప్త కులగణన నిర్ణయం చారిత్రాత్మకం అని చారిత్రాత్మక నిర్ణయాలు అమలు చేయడం భారత ప్రధాని నరేంద్ర మోడీకే సాధ్యమని వారు ఆన్నారు.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ బీసీల హక్కుల కోసం నిరంతర పోరాటాలతోనే కులగణన సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి, మేమెంతో మాకంత కూడా వాటా కావాలని, సభలు, సమావేశాలు, రిజర్వేషన్ల సాధన యాత్రలు, దేశవ్యాప్తంగా కులగణనను జరపాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ధర్నా, ఆందోళనలు నిర్వహించి, దేశంలో అధికార పక్షాన్ని బీసీల వైపు మళ్లించే విధంగా అనేక పోరాటాలు చేయడం జరిగిందని వారు స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించి, తెలంగాణలో కులగణన జరిపి అసెంబ్లీలో చట్టం చేసి, కేంద్రానికి పంపిందని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం, ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీ ప్రజల కోరిక మేరకు దేశవ్యాప్తంగా కులగణన నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తుందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివే యాలనీ, వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ యూత్ అధ్యక్షులు ముదారపు శేఖర్ పాల్గొన్నారు.