డబ్ల్యుఆర్‌సీ 3 పోటీలకు నవీన్ పులిగిల్ల సిద్ధం
నేటి నుంచి ఈ నెల 30వరకు పరాగ్వేలో నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ర్యాలీ డ్రైవర్ నవీన్ పులిగిల్ల మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సవాల్‌కు సిద్ధమయ్యారు. అనుభవజ్ఞుడైన కో-డ్రైవర్ ముసా షరీఫ్‌తో కలిసి ఎఫ్‌ఐఏ వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుఆర్‌సీ)లో భాగమైన ‘రాలీ డెల్ పరాగ్వే’లో డబ్ల్యుఆర్‌సీ 3 విభాగంలో పోటీ చేయనున్నారు. డబ్ల్యుఆర్‌సీలో 11వ రౌండ్‌గా జరిగే ఈ పోటీలు గురువారం నుంచి ఈ నెల 30 వరకు పరాగ్వేలో జరగనున్నాయి.
డ్యూరాన్ రేసింగ్ తరఫున బరిలోకి దిగనున్న నవీన్‌ముసా జోడీ, ఎంఆర్‌యూ మోటార్ స్పోర్ట్ సిద్ధం చేసిన ఫోర్డ్ ఫియస్టా ర్యాలీ3 కారులో పోటీ చేయనుంది. పరాగ్వే ర్యాలీతో ప్రారంభమయ్యే వరుస డబ్ల్యుఆర్‌సీ పోటీ కార్యక్రమంలో భాగంగా, రెండు వారాల తర్వాత చిలీలో జరిగే తదుపరి రౌండ్‌లోనూ ఈ జోడీ పాల్గొననుంది. మంగళవారం నిర్వహించిన ర్యాలీ రీకీ అనంతరం నవీన్ మాట్లాడుతూ, పరాగ్వేలో అధిక వేగంతో కూడిన స్టేజ్లు, మారుతూ ఉండే గ్రిప్, చాలా స్వల్ప తేడాలతో పోటీ ఉండటం ప్రత్యేకత. మృదువైన గ్రావెల్ ట్రాక్ త్వరగా మారిపోయే అవకాశం ఉండటంతో భూభాగం క్లిష్టంగా మారుతుంది. బ్రేకింగ్, డ్రైవింగ్ లైన్స్ విషయంలో చాలా కచ్చితత్వంతో వ్యవహరించాలి అని అన్నారు.






