calender_icon.png 26 October, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్సల్స్‌కు వరసదెబ్బలు

23-01-2025 12:00:00 AM

అయిదు దశాబ్దాలకుపైగా ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుం డా చేసిన మావోయిస్టు ఉద్యమం దేశంలో ఇప్పుడు కనుమరు గు కానుందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఒకప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలకు విస్తరించిన ఈ ఉద్యమం ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దండకారణ్య ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగి స్తున్న మావోయిస్టులను తుదముట్టించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గత రెండు మూడేళ్లుగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

2026 మార్చి చివరినాటికి మావోయిస్టురహిత దేశంగా మార్చడమే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత ఏడాది ప్రకటించిన తర్వాత మావోయిస్టుల ఏరివేత జోరందుకుంది. తాజాగా రెండు రోజుల క్రితం చత్తీస్‌గఢ్ ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు.  మృతుల్లో కీలక నేతలు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై గతంలో అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో చలపతి ప్రధాన నిందితుడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఇతనిపై కోటి రివార్డు ఉండడం గమనార్హం. రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాలయిన గరియాబంద్, నౌపాడ జిల్లాల అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తిరుగుతున్నారన్న నిఘావర్గాల సమాచా రం ఆధారంగా చత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా వెయ్యి మందికిపైగా కలిసి మూడు రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది.

కొత్త ఏడాది ప్రారంభమయిన 20 రోజుల్లోనే ఇప్పటివరకు 40 మందికి పైగా మావోయిస్టు లు మృతి చెందారు. ఈ నెల 16న బీజాపూర్ జిల్లాలోని కాంకేర్‌లో జరిగి న ఎన్‌కౌంటర్‌లో18 మంది మావోయిస్టులు హతమయ్యారు. రెండు ఎన్‌కౌంటర్లలో పలువురు కీలక నేతలు హతమైనట్లు మావోయిస్టు వర్గాలే అంగీకరించాయి. ఇక గత ఏడాది జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో 219 మం ది నక్సల్స్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

వీరంతా బస్తర్ ప్రాంతంలో హతమైనవారే. ఎన్‌కౌంటర్ల సందర్భంగా భద్రతా దళాలు ఏకే47, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లులాంటి అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు డంప్‌ల ను స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా 800 మందిని అరెస్టు చేయ గా, మరో 802 మంది ఆయుధాలను వదిలిపెట్టి పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. తాజా ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా స్పందిస్తూ నక్సల్ ఉద్యమం అవసాన దశలో ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.

అమిత్ షా వ్యాఖ్యలు నిజమేనని కొంతకాలంగా జరుగుతున్న ఘటనలను చూస్తే అర్థమవుతుంది.  నక్సల్స్‌కు ఆయువుపట్టయిన చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఏర్పడడంతో కేంద్రం బస్తర్ అటవీ ప్రాంతంలో చేపట్టిన ‘ఆపరేషన్ ప్రహార్’కు స్థానిక బలం కూడా తోడయింది. అత్యాధునిక ఆయుధాలు,డ్రోన్లు లాంటి సాంకేతికతతో కేంద్రబలగాలు చేపట్టే గాలింపు చర్యలకు రాష్ట్ర పోలీసు బలగాలు దన్నుగా మారాయి.

దీంతో బలగాలు గత కొన్ని నెలలుగా అడవంతా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు ఎదురుపడితే చాలు విగతజీవులుగా మారిపోతున్నారు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలగా నక్సల్స్ ఉద్యమంలోకి కొత్తగా రిక్రూట్‌మెంట్లు జరగడం లేదు. ఒకప్పుడు యువతను పెద్దగా ఆకర్షించిన ఈ ఉద్యమం ఇప్పుడు ఆ స్థాయిలో వారిని ఆకట్టుకోలేకపోతోంది. మరోవైపు అభివృద్ధి ఫలాలు తెచ్చిన మార్పు ఫలితంగా యువకులు ఎక్కువ మంది చదువులు, ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతున్నారు.

అంతేకాదు అయిదు దశాబ్దాల ఉద్యమంలో సాధించింది ఏమీ లేదని, వేలాది మంది బందూకులకు బలిగావడం ఒక్కటే మిగిలిందని వారికీ అర్థమవుతోంది. దళంలో ఉన్న కీలక నేతల్లో చాలామంది వయోభారానికి తోడు అనారోగ్యాల బారిన పడ్డంతో జనజీవన స్రవంతిలో కలవడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అన్ని సాయుధ పోరాటాలలాగే ఈ ఉద్యమం కూడా రోజురోజుకు చిక్కి శల్యమవుతోంది. కనుమరుగు కావడం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.