calender_icon.png 24 November, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంలో ఉత్సాహంగా ఎన్సీసీ దినోత్సవం

24-11-2025 04:31:07 PM

కవాతుతో ఆకట్టుకున్న క్యాడెట్లు..

అదనంగా మరో 80 మంది క్యాడెట్ల మంజూరు..

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం 77వ ఎన్సీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని దాదాపు 100 మంది క్యాడెట్లతో ఉత్సాహంగా నిర్వహించారు. 1948లో స్థాపించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్ సీసీ), భారతదేశ యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవ, దేశ నిర్మాణాన్ని పెంపొందిస్తున్న విషయం విదితమే. ఈ వేడుకలు క్యాడెట్ల సమావేశం, కవాతుతో ప్రారంభమయ్యాయి. తరువాత గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు జెండా ఎగురవేయగా, క్యాడెట్లు ఎన్ సీసీ ప్రతిజ్జ చేసి, విధి, జాతీయ విలువల పట్ల వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

నిజామాబాదులోని ఎన్ సీసీ గ్రూపు ప్రధాన కార్యాలయ గ్రూప్ కమాండర్ కల్నల్ రాజేష్ కపూర్ ఎఫ్ఎప్ఎఫ్ఎస్ పథకం కింద అదనంగా మరో 80 మంది క్యాడెట్లను మంజూరు చేశారని ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వెల్లడించారు. దీని వలన గీతం క్యాడెట్ల సంఖ్య 160కి పెరిగి, దాదాపుగా రెట్టింపు అయిందని, ఇకమీదట పూర్తి కంపెనీగా పనిచేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. సంగారెడ్డిలోని 33 (టి) బెటాలియన్ కింద పనిచేస్తున్న గీతం ఎన్ సీసీ గత ఐదేళ్లుగా శారీరక శిక్షణ శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో స్థిరంగా రాణించిందని రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తెలిపారు.

యువశక్తి – వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా బాధ్యతాయుతమైన, దేశ భక్తి, క్రమశిక్షణతో కూడిన యువతను రూపొందించడంలో ఎన్ సీసీ కీలక పాత్ర పోషిస్తోందని ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ సీసీ అండర్ ఆఫీసర్ల సహకారంతో, కేర్ టేకింగ్ ఆఫీసర్ అజయ్ కుమార్ సమన్వయం చేశారు. వివిధ కార్యక్రమాలలో రాణించిన అత్యుత్తమ క్యాడెట్లకు జ్జాపికలను అందజేశారు. గీతం ఎన్ సీసీలో భాగంగా, క్యాడెట్ల ఐక్యత, గర్వాన్ని ప్రతిబింబింబే గ్రూపు ఫోటో సెషన్ తో కార్యక్రమం ముగిసింది.