calender_icon.png 24 October, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి

24-10-2025 12:00:00 AM

కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 23 (విజయక్రాంతి): వైద్య విద్యార్థుల  అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, కళాశాల అన్ని విభాగాలు, వసతులు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా  కొత్తగా నిర్మాణంలో ఉన్న హాస్టల్ వసతి భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌ఎంబీ అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య కళాశాల అభివృద్ధి అంటే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అని,వారికి సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన ఆవరణ, ఉత్తమ విద్యా వాతావరణం, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండాలి అన్నారు.

ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది లెక్చరర్ గ్యాలరీ ఏర్పాటుకు విజ్ఞప్తి చేయగా, దానిని త్వరలోనే అమలు చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.   వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్, డాక్టర్ సురేష్ బాబు వార్డెన్, కోటేశ్వరరావు ఏడిఈ, అధ్యాపకులు, సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కలెక్టర్

బూర్గంపాడు, అక్టోబర్ 23 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలను సమీకరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

రైతులు కూరగాయల సాగుతో పాటు బంతిపువ్వులు, కొర్రమీను చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం,మేకల పెంపకం వంటి పలు రంగాలను ఒకే ఆవరణలో నిర్వహించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.    కార్యక్రమంలో డి.ఆర్.డీ.ఏ ఈసీ రాజు, ఏపీఓ వెంకయ్య, ఉపాధి హామీ పథకం ఏపీఓ విజయలక్ష్మి, ఐకెపి ఏపీఎం హేమంతి,పంచాయతీ సెక్రటరీ భవాని,టెక్నికల్ అసిస్టెంట్ స్వాతి, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.