24-10-2025 08:25:26 PM
తాండూరు,(విజయక్రాంతి): మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య , క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఆయన వికారాబాద్ జిల్లా కోట్ పల్లి సాగునీటి ప్రాజెక్టులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి మూడు రకాల పది లక్షలకు పై చిలుకు చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముదిరాజు, బెస్త మత్స్యకారుల కుటుంబాల వారు ఆర్థికంగా బాగుపడాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులలో చేప పిల్లలను వదలడం జరుగుతుందని అన్నారు.
జిల్లాలో ఒక కోటి 29 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని అందుకుగాను కోటి 7 లక్షల రూపాయలను వెచ్చించడం జరుగుతుందని...రాష్ట్రంలోని 5 లక్షల మత్స్య కారుల కుటుంబాలకు జీవనోపాధి కలిగే విధంగా రూ 123 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మత్స్యకారులు ఏదైనా ప్రమాదాలకు గురి అయినట్లయితే కోటి 40 లక్షల ఉచిత బీమాకు గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
మత్స్యకారుల సంఘాల్లో సభ్యత్వ సమస్య ప్రధానంగా ఉందని ఇట్టి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల నిధులను వెచ్చించి ముదిరాజుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమ పథకాల్లో లబ్ది పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.