04-09-2025 12:00:00 AM
* ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, సెప్టెంబర్ 3 :ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు పటాన్ చెరులో ఆధునిక వసతులతో కూడిన విశాలమైన ప్రాంగణాలలో నూతన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో రూ.16 కోట్లతో నిర్మిస్తున్న పీవీ నరసింహారావు ఆడిటోరియం, రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఇంజనీరింగ్ బిల్డింగ్ పనులను ఆయన బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఏకీకృత భవనంలో సేవలు అందించేలా పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, ఆర్ అండ్ బీ, గ్రామీణ నీటిపారుదల శాఖల కార్యాలయాల కోసం రూ.2 కోట్లతో జీ ప్లస్ వన్ పద్ధతిలో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం లో చేపడుతున్న భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఒకే భవనంలో ప్రజలకు సేవలు అందిస్తాయని తెలిపారు.
రూ.16 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న పీవీ నరసింహారావు ఆడి టోరియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వచ్చే నెల రోజుల్లోగా ఆడిటోరియం, ఇంజనీరింగ్ భవనం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం డీఈ సురేష్, నీటిపారుదల శాఖ డీఈ రామస్వామి, జీహె చ్‌ఎంసీ ఈఈ సురేష్, డీఈ కృష్ణవేణి, ఏఈ శివకుమార్, ఎంఈవో నాగేశ్వరరావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.