05-09-2025 05:57:06 PM
పటాన్ చెరు:(విజయక్రాంతి): యువ మనస్సులను రూపొందించడంలో విద్యావేత్తలు, మార్గదర్శకుల అమూల్యమైన పాత్రను గౌరవించ డానికి, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారతదేశంలోని అత్యంత విశిష్ట పండితులలో ఒకరు, దేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుని, ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ వేడుకలలో భాగంగా, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఉత్తమ సహాయ సిబ్బంది అవార్డులను ప్రదానం చేయడం ద్వారా గీతం అత్యుత్తమ కృషిని గుర్తించింది. ఉత్తమ ఉపాధ్యాయుడికి రూ.60 వేలు, ఉత్తమ సహాయ సిబ్బంది (ఇన్-హౌస్, అవుట్ సోర్స్) ఒక్కొక్కరికి రూ.40 వేల నగదు పురస్కారాలను అందజేశారు.
స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయశేఖర్ జాలిపర్తి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు; స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ కె. సత్యనారాయణతో పాటు ఆతిథ్య విభాగం (ఆహార తయారీ) సూపర్ వైజర్ అమర్జిత్ కుమార్ కు ఉత్తమ సహాయ సిబ్బంది అవార్డులను ఇచ్చి సత్కరించారు.
ఈ అవార్డులను గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు అందజేశారు. అవార్డు గ్రహీతల అంకితభావం, నిబద్ధత, సంస్థకు వారందించిన అమూల్యమైన సేవలను ప్రశంసించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి గీతం యొక్క విద్యా నైపుణ్యానికి వెన్నెముకగా నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. కళాకృతి బృందం శాస్త్రీయ నృత్యాలు, జుగల్ బంది, లలిత సంగీతం అధ్యాపకులు, సిబ్బంది ప్రశంసలు అందుకుంది. చప్పట్లతో ఆడిటోరియం మార్మోగిపోయింది.