25-05-2025 05:29:45 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DEC Infrastructure)కు అప్పగించింది. ఆ కంపెనీ ఇటీవల ఈ ప్రాజెక్టును అందుకున్నట్లు ఒక ప్రకటనలో ధృవీకరించింది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్‌లో కొత్తగా నిర్మించే తెలంగాణ హైకోర్టు భవనానికి 100 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. మార్చి 27, 2024న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ కొత్త హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు.
కాగా, కొత్త హైకోర్టు, న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణం కోసం తాము దాదాపు రూ.2600 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆరు అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం ఏర్పాటు చేసి ఒకేసారి 2800 కార్టు నిలిచేలా పెద్ద పార్కింగ్, అత్యాధునిక పద్దతుల్లో నిర్మాణం చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయం నిర్మాణ నమూన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి దగ్గరి పోలీకలు ఉన్నాయని, పెద్ద ప్యాలెస్ ల ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.