14-07-2025 02:20:19 PM
సనత్‌నగర్, (విజయ క్రాంతి): తెలంగాణ ప్రజల ఆత్మభిమానానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండగ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి(Ujjaini Mahakali Temple) ఆలయంలో వైభవంగా జరిగాయని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Kota Neelima) తెలిపారు. పండగలో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చి బోనం సమర్పించారని పేర్కొన్నారు. డప్పు సప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్ డ్యాన్సులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని. భక్తులు తమ సంప్రదాయ దుస్తుల్లో డప్పుల తాళాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అమ్మవారిని కీర్తించారని తెలిపారు. ముఖ్యంగా శక్తి స్వరూపులైన పోతరాజులు అత్యంత భక్తిశ్రద్దలతో ఊరేగింపులో పాల్గొన్నారని చెప్పారు.
పండుగలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారని తెలిపారు. జాతరలో రెండో రోజు ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యర్యంలో పవిత్రమైన రంగం కార్యక్రమం నిర్వహించామని.. ఇందులో భాగంగా అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏర్పాట్లు సంతోషాన్ని కలిగించాయని అమ్మవారు భవిష్య వాణిలో ప్రకటించారని తెలిపారు.రంగం అనంతరం అంబారీపై అమ్మవారి ఊరేగింపు, బలిపూజ, గావు పట్టడం కార్యక్రమాలు ఘనంగా జరిగాయని తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అంటేనే సామాన్యుల దేవత అన్నారు. బోనాల విజయవంతానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులను అభినందించారు. బోనాల నిర్వహణకు బడ్జెట్ కేటాయించి ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు కోట నీలిమ.