17 April, 2026 | 3:33 AM

సరెండర్ చేసినా చర్యలు లేవు

17-04-2026 01:54 AM
  1. ఏసీబీ అధికారులు  దాడులు నిర్వహించి అక్రమాలను తేల్చేనా..?
  2. చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు ఎందుకో...?
  3. నేడు జరగనున్న బల్దియా సమావేశంలో అక్రమాధికారులపై చర్చ సాగేనా 
  4. మున్సిపల్ కమిషనర్, టిపిఓలను మాతృ సంస్థకు సరెండర్ చేయకపోవడంలో మతలభేమిటి 
  5. తెర వెనుక రాజకీయ ఉద్దండులు చర్యలకు మోకాలు అడ్డు నివ్వెర పోతున్న ప్రజలు

కామారెడ్డి, ఏప్రిల్ 1౬ (విజయక్రాంతి ): అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని గత మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంతవరకు బాగానే ఉన్నా అధికారులు మాత్రం సరెండర్ కాలేదు. దీంతో కామారెడ్డి ప్రజలు నివ్వెర పోతున్నారు. మున్సిపాలిటీకి వద్దని అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఏకగ్రీవంగా పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసిన సరెండర్ కు నోచుకోకపోవడంతో దొంగ చాటుగా విధులు నిర్వహి స్తున్న అధికారులను తీరును చూసి ప్రజలు నివ్వరపోతున్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీ ప్రక్షాళన చేసి గాడిలో పెట్టే అధికారులే కరువైపోయారని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ అవినీతికి పాల్పడడంలో రారాజులుగా పేరుగాంచారని పలువురు పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మాణం చేపట్టిన 47 అపార్ట్మెంట్ల నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగించారు. వాటికి కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారికి గిరిధర్లు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

అపార్ట్మెంట్ల యజమానుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారని, అందుకే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన చూసి చూడనట్లుగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అపార్ట్మెంట్ల నిర్మాణం భవన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు నోటీసులు జారీ చేసి లక్షలు కాజేశారని నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క నిర్మాణదారుని వద్ద మూడుసార్లు టౌన్ ప్లానింగ్ కను సన్నల్లో పనిచేసే సిబ్బంది

వసూళ్లకు పాల్పడ్డారని నిర్మాణదారులు ఆక్రందన వెలిబుచ్చుతు న్నారు. ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకుల పేరు చెప్పి నోటీసులు జారీ చేసి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని నిర్మాణదారుల రక్తం డబ్బు రూపంలో దోచేశారని వారు విమర్శిస్తున్నారు. ఇలాంటి టౌన్ ప్లానింగ్ అధికారి సిబ్బందిని తామెప్పుడూ చూడలేదని నిర్మాణం జరుగుతున్నప్పుడు వచ్చి బెదిరించడం డబ్బులు ఇవ్వగానే మానేయడం మరికొన్ని రోజులకు నోటీసు జారీ చేయడం మరిన్ని డబ్బులు గుంజడం అవినీతిని కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపించాలని పలువురు ఆరోపిస్తున్నారు.

డబ్బులకు కక్కుర్తి పడడం వెన్నతో పెట్టిన విద్యల నేర్చుకున్నారని ఆర్కిటెక్ ఇంజనీర్ సైతం వాపోతున్నారు. ప్రతి వార్డులో అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అనుమతి పొందిన విధంగా ఏ ఒక్క నిర్మాణం జరగడం లేదని ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్లు కొందరు అంటున్నారు. డబ్బు ఉంటే అధికారం కూడా తమకు అనుకూలంగానే ఉంటుందని అందిన కాడికి దోచుకొని తాము ఎలాంటి తప్పు చేయలేదని నీతులు వల్లిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే పర్మిషన్ తీసుకున్న విధంగా నిర్మాణం జరగడం లేదు.

ది తెలిసి కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం కరువైపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే కామారెడ్డి పట్టణంలో అక్రమ నిర్మాణాల జాబితా పెద్ద సంఖ్యలోనే ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడుల్లో అనేక అవకతవకలు  బయటపడినప్పటికీ వాటి వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించడం లేదు.

అక్రమాలను కూడా అధికారులు గోప్యంగా ఉంచడం పట్ల పట్టణ ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటి కమీషనర్ రాజేందర్ రెడ్డి, టీపిఓ గిరిధర్ , కిందిస్థాయి అధికారులు కలిసి చేసిన అక్రమాలు రుజువయ్యాయని వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరన్నారు. అవసరం అవుతే టాస్క్ ఫోర్స్ సిబ్బందిని రంగంలో దించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఆయన అన్నారు. తప్పు చేసిన అధికారులకు తప్పకుండా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నరు.

ఈ విషయంపై మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ కామారెడ్డి ఆర్డిఓ గిరి దృష్టికి తీసుకురాగా టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ పై షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందని ఇప్పటివరకు సమాధానం రాలేదని అన్నారు. సమాధానం ఇచ్చిన తర్వాత చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం జరిగిందన్నారు. టిపిఓ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలకు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో కొన్ని తప్పులు జరిగిన విషయం వాస్తవమేనని వాటిని సరిచేసి ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని ఇంచార్జ్ కమిషనర్ గిరి స్పష్టం చేశారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలో బల్దియా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని గత మున్సిపల్ సమావేశంలో పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసిన ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద మొత్తంలో పలుకుబడిన రాజకీయ నాయకుల అండదండలు తీసుకొని నిర్భయంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ సమావేశంలో గత సమావేశం లో చర్చించిన అంశాలను సభ్యులు పట్టుబట్టి అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేందుకు తమ కెందుకులే అని ఊరుకుంటారా వేచి చూడాల్సిందే. పాలకవర్గ సభ్యులు సైతం అక్రమాదికారుల కు అండదండలు ఉంటాయా అనేది జనరల్ బాడీ సమావేశంలో తేల ను ఉంది.