calender_icon.png 27 July, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాన్స్‌కు కొదవ లేకుండా..

26-07-2025 12:20:49 AM

హీరోయిన్ల అంద చందాలను తెరపై ఆవిష్కరించడమంటే అల్లాటప్పా వ్యవహారం కాదు. గులాబీ మొక్కకు అంటు కట్టినంత జాగ్రత్తగా చేయాల్సిన పని! ఆ పని తనకు వెన్నతో పెట్టిన విద్య అని తొలి సినిమా ‘ఉప్పెన’తోనే నిరూపించిన దర్శకుడు బుచ్చి బాబు సానా. ఆ చిత్రంలో కథానాయిక కృతిశెట్టిని ఆయన తెరపై అందంగా ఆవిష్కరిం చిన తీరుకు యువత ఫిదా అయ్యింది. ఆ సినిమాలో నాయకానాయికల మధ్య మాంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది.

అలా రొమాంటిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు ఇప్పుడు ఆ ఛాన్స్ ‘పెద్ది’లోనూ తీసుకుంటున్నాడట. ఇందులో రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా జాన్వీ కపూర్ అందాన్ని తనదైన శైలిలో ప్రేక్షకులకు వడ్డించే క్రమంలో తన ఆలోచనలకు ‘సాన’బెట్టారట ఈ డైరెక్టర్ బాబు. ‘దేవర’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆ చిత్రంలో గ్లామరస్ పాత్రలోనే కనిపించింది. ఆమె నటించిన ‘తంగ’ క్యారెక్టర్ నటనకు అంతగా స్కోప్ లేదు.

అందులో హీరో ఎన్టీఆర్‌తో కాంబినేషన్ సన్నివేశాలు కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి. అలా తారక్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ పోగొట్టుకుంది జాన్వీ. కానీ ‘పెద్ది’లో మాత్రం రామ్‌చరణ్‌తో రొమాన్స్‌కు ఏమాత్రం కొదవ ఉండదనేది లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. తాజా షెడ్యూల్‌లో కొంత టాకీతోపాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తున్నారట. ఇది రామ్‌చరణ్ మధ్య వచ్చే ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అని సమాచారం.

రెహమాన్ ఈ గీతాన్ని ఎంతో హృద్యంగా కంపోజ్ చేశారని టాక్. ప్రేమికుల మధ్య విరహ వేదనను ఈ పాటలో ఆవిష్కరించనున్నారట. మొత్తానికి మాస్ కంటెంట్‌తో తాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోనూ రొమాంటిక్ గీతాలకు బుచ్చిబాబు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. ఈ పాట విషయంలో బుచ్చిబాబు చాలా కాన్పిడెంట్‌గా ఉన్నారని, ఈ పాట కచ్చితంగా యువత హృదయాల్ని దోచుకుంటుందని భావిస్తున్నారని టాక్. ఈ సినిమా రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026, మార్చి 27న విడుదల కానుంది.