calender_icon.png 15 September, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17 నుంచి పోషణ మాసం

15-09-2025 01:33:15 AM

  1. చిన్నారులు, మహిళల్లో పోషకాహారంపై చైతన్యం కల్పించేందుకు నెల రోజుల పాటు కార్యక్రమాలు
  2. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరేలా కార్యాచరణ 
  3. ప్రతి ప్రాజెక్టుకు రూ.30 వేలు, జిల్లాకు రూ.50 వేల చొప్పున నిధులు మంజూరు
  4. పోషణ మాసాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సీతక్క లేఖలు 

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్రం సహకారంతో నిర్వహిస్తోందని పేర్కొన్నారు..

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని, తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించాలని మంత్రి సీతక్క వారికి పంపిన లేఖల్లో కోరారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వం తరఫున ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు రూ.30 వేలు, ప్రతి జిల్లాకు రూ.50వేల చొప్పున నిధులను విడుదల చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ నిధులను ఉపయోగించి గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ర్ట స్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు, అలాగే చక్కెర, ఉప్పు, నూనె వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో సక్రమమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో ప్రతి ఇంటికీ పోషణ సందేశం తీసుకెళ్తామన్నారు. 

పోషకాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యం 

పోషణ మిషన్‌లో పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా కుటుంబాల్లో పోషకాహారంపై సమగ్ర అవగాహన కల్పించాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశమని మంత్రి సీతక్క వివరించారు.“వోకల్ ఫర్ లోకల్‌” నినాదంతో గ్రామీణ స్థాయిలో ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించి ఆత్మనిర్భరతను పెంచే కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో గ్రామస్థాయిలోనూ పోషణ డేటాను సేకరించి, వాటిపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపడతామన్నారు.

పోషణ మాసం కాలంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసి, ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తామన్నారు. పోషణ మాసంలో భాగంగా ప్రతి రోజు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను సిద్ధం చేసి జిల్లాలకు పంపించామని తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజలంతా చురుకైన పాత్ర వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.