15-09-2025 12:52:09 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వేలాది మంది బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో, రాష్ర్ట లీగల్ సర్వీసెస్ అథారిటీ భారీ ఊరట కల్పించాయి. శనివారం నిర్వహించిన మూడవ జాతీయ మెగా లోక్‌అదాలత్ ద్వారా, దానికి ముందు చేపట్టిన చర్యలతో కలిపి, ఒకే విడతలో ఏకంగా 40.86 కోట్లను 7,040 మంది బాధితులకు తిరిగి ఇప్పించి రికార్డు సృష్టించాయి.
ఈ చొరవతో బాధితుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ కావడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. మూడవ జాతీయ మెగా లోక్‌అదాలత్ సందర్భంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాష్ర్టంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా ఎస్పీల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ ఒక్కరోజే 4,539 మంది బాధితులకు 12.94 కోట్లు తిరిగి చెల్లించేలా రిఫండ్ ఆర్డర్లను జారీ చేశారు. దీనికి ముందుగా, ఇదే విడతలో భాగంగా మరో 2,501 మంది బాధితులకు 27.91 కోట్లు రిఫండ్ చేశారు.
దీంతో ఈ విడతలో మొత్తం 7,040 మంది బాధితులకు 40.86 కోట్లు అందాయి.ఈ విజయంతో, కేవలం 2025 సంవత్సరంలోనే లోక్‌అదాలత్ ద్వారా మొత్తం 138.04 కోట్లను 18,872 మంది బాధితులకు తిరిగి అందించినట్లయింది. తెలంగాణలో 2024 మార్చి నుండి ఇప్పటివరకు మొత్తం 36,786 మంది బాధితులకు 321 కోట్లు రిఫండ్ చేయడం ద్వారా సైబర్ బాధితులకు న్యాయం చేయడంలో దేశంలోనే రాష్ర్టం అగ్రగామిగా నిలుస్తోంది.
సైబరాబాద్.. 1,937 కేసులు, 11.51 కోట్లు, హైదరాబాద్.. 941 కేసులు, 9.29 కోట్లు, రాచకొండ.. 1,061 కేసులు, 6.41 కోట్లు, టీజీసీఎస్‌బీ హెడ్‌క్వార్టర్స్.. 197 కేసులు, 4.21 కోట్లు, సంగారెడ్డి.. 266 కేసులు, 1.04 కోట్లు మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, డిజిటల్ చోరీల వంటి కేసుల్లో బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లతో టీజీసీఎస్‌బీ రియల్‌టైమ్ సమన్వయం చేస్తూ, లోక్‌అదాలత్ ద్వారా వివాదాలను వేగంగా పరిష్కరిస్తూ బాధితులకు తక్షణ న్యాయం అందిస్తోంది.
పోలీసుల కీలక సూచనలు..
సైబర్ మోసాల బారిన పడకుండా ఉం డేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లో నూ తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు.కస్టమర్ కేర్ నంబర్ల కోసం అధికారిక వెబ్‌సై ట్లను మాత్రమే సంప్రదించాలి.ఇమెయిల్, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’లోనే హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయడం లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు నిరంతరం కృషి చేస్తామని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ తెలిపారు.