calender_icon.png 15 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రను వెలికితీశాం

15-09-2025 01:39:09 AM

  1. నిజాం అరాచకాలను 75 ఏళ్లుగా విస్మరించిన పాలకులు
  2. పటేల్ ఉక్కు సంకల్పంతోనే హైదరాబాద్‌కు విముక్తి
  3. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోంది
  4. విమోచన చరిత్రపై ప్రత్యేక డిజిటల్ మ్యూజియం
  5. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): గత 75 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన చరిత్రను, నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల దుర్మార్గాలను ఉద్దేశపూర్వకం గా దాచిపెట్టాయని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వమే ఆ చారిత్రక వాస్తవాల ను వెలికితీసి, అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో, డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి చారిత్రక ఘట్టాలను గుర్తు చేసుకున్నారు.

ఆగస్టు 15, 1947న దేశమంతా స్వాతంత్య్ర సంబురాల్లో మునిగి తేలుతుంటే, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయిందని, భారతదేశంలో విలీనం కాకుండా పాకిస్థాన్‌తో కలుస్తానని నిజాం మొండికేశారని, ఆయన సైన్యం రజాకార్లు 13 నెలలపాటు ప్రజలపై దాడులు, ఆడబిడ్డలపై లైంగికదాడులు, హత్యలతో దమనకాండ సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు.

అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సైనిక చర్యకు ఆదేశించి, నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించారని కొనియాడారు. కానీ దురదృష్టవశాత్తు, ఇన్నేళ్లు పాలించిన పార్టీలు ఈ త్యాగాల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చలేదని, అధికారికంగా వేడుకలు నిర్వహించలేదని మండిపడ్డారు.

1998లో బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసినందుకు తమ కార్యకర్తలపై అప్పటి ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయించాయని ఆరోపించారు. తాను కేంద్రమంత్రి అయ్యాక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహకారంతో, రాష్ర్ట ప్రభుత్వాలు ముందుకు రాకపోయినా, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు ప్రారంభించామని తెలిపారు. 

ముఖ్యఅతిథిగా రాజ్‌నాథ్‌సింగ్

ఏ సైన్యం అయితే నాడు ప్రజలను రక్షించిందో, అదే రక్షణ శాఖకు మంత్రి అయిన రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 17న నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. అయినా రాష్ర్ట ప్రభుత్వం ఈ వేడుకలకు దిగిరాకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఎవరు ఔనన్నా కాదన్నా, వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిపై మూడు రంగుల జెండా ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాలను ఘనంగా జరుపుకునే పరిస్థితిని కల్పిస్తాం అని ధీమా వ్యక్తంచేశారు.

విమోచన ఉద్యమ చరిత్రను, నిజాం పాలనలోని దమనకాండను ప్రజలకు సులభంగా తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డిజిటల్ మ్యూజియంను రూపొందించిందని తెలిపారు. ప్రజలందరూ తమ సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా ఈ మ్యూజియాన్ని వీక్షించి చారిత్రక వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.