calender_icon.png 15 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ భావజాల ఉద్యమాన్ని విస్తరిస్తాం

15-09-2025 01:30:47 AM

  1. పాటే ఆయుధంగా రాజకీయ అధికారం దక్కించుకుంటాం
  2. పాలితులుగా ఉన్న బీసీలను పాలకులుగా చేయడానికి కళాకారులు కృషిచేయాలి
  3. బీసీ కల్చరల్ ఫోరం సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : పాటనే ఆయుధంగా చేసుకుని బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి ప్రత్యేక రాష్ర్టం సాధించినట్లుగానే బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి అధికారం సాధించాలని సూచించారు.

ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ కల్చరల్ ఫోరం రాష్ర్ట కమిటీ సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడారు. బీసీలకు వారసత్వంగా గొప్ప చరిత్ర ఉందన్నారు. బీసీ కులాల్లో రాజులు, చక్రవర్తులు, మహనీయులు జన్మించారని పేర్కొన్నారు. ఇలాంటి ఘనమైన చరిత్ర కలిగిన బీసీలు ఐదు శాతం లేని వాళ్ల దగ్గర సాగిల పడి అడుక్కోవడంలో అర్థం లేదన్నారు. బీసీ కళాకారులు, కవులు తమ వారసత్వాన్ని, సాంస్కృతిక చైతన్య వైభవాన్ని భవిష్యత్ తరాలకు చాటి చెప్పాలన్పారు.

పాలితులుగా ఉన్న బీసీలను పాలకులుగా చేయడానికి బీసీ సాంస్కృతిక సైన్యం నిర్విరామంగా కృషి చేయాలని కోరారు. రాయితీల నుంచి రాజ్యాధికారం కోసం, స్వయంపాలన, స్వయం నిర్ణయ అధికారం వచ్చే వరకు చేసే ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు తమ వంతు పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కల్చరల్ ఫోరం రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వరంగల్ శ్రీనివాస్, దరువు అంజన్న మాట్లాడుతూ... బీసీ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి దసరా తర్వాత 33 జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో వేలాదిమందితో బీసీ కల్చరల్ ఫోరం రాష్ర్ట మహాసభను నిర్వహిస్తామని చెప్పారు. బీసీ కల్చరల్ ఫోరం రాష్ర్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కోదారి శ్రీనివాస్, రాష్ట ఉపాధ్యక్షుడు అంబటి వెంకన్న, సిరిసినవాడ రామలింగం మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీల రాజకీయ చైతన్యానికి గ్రామ గ్రామాన బీసీల ధూంధాం సభలు నిర్వహిస్తామని తెలిపారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సాంస్కృతిక ఉద్యమాన్ని ఉధృతం చేసి హక్కుల సాధనకు కృషిచేస్తామని చెప్పారు. సమావేశంలో సిగ విజయ్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, సంతోష్, జడల రమేష్, యాట సంధ్య, బుల్లెట్ వెంకన్న, బీసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, కనకాల శ్యాం కుర్మా, మని మంజరి, ఏం చంద్రశేఖర్ గౌడ్, జాజుల లింగం గౌడ్, వరికుప్పల మధు పాల్గొన్నారు.