calender_icon.png 15 September, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేజీలకు తాళం!

15-09-2025 01:59:37 AM

నేటి నుంచి ఇంజినీరింగ్ సహా ప్రొఫెషనల్ కాలేజీలు బంద్

  1. నల్లబ్యాడ్జీలతో కాలేజీలకు హాజరు.. అనంతరం తరగతుల బహిష్కరణ 
  2. రేపటి నుంచి డిగ్రీ కాలేజీలూ బంద్
  3. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ స్పష్టీకరణ
  4. పెండింగ్ ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
  5. ప్రభుత్వానికి అల్టిమేటం.. ఈనెల 21 వరకు గడువు
  6. లేదంటే 23 లేదా 24న లక్షలాది మంది విద్యార్థులతో సభ

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు సోమవారం, డిగ్రీ కాలేజీలకు మంగళవారం తాళాలు వేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతి) ప్రకటించింది. హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన అసోషియేషన్ జనరల్ బాడీ సమావేశంలో స్పష్టం చేసింది.

సమావేశానికి దాదాపు 760 కాలేజీల యాజమాన్యాలు హాజరయ్యాయి. సమావేశంలో సంఘం తీసుకున్న నిర్ణయాలను ‘ఫతి’ చైర్మన్ ఎన్.రమేశ్‌బాబు మీడియాకు వివరించారు. సోమవారం నుంచి కాలేజీలకు విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బందెవరూ రారని, కాలేజీలకు తాళాలు వేసి ఉంటాయని తేల్చిచెప్పారు.

సర్కార్ ఈనెల 21 లోపు ట్రెజరరీ ద్వారా జారీ చేసిన టోకన్లకు సంబంధించిన రూ.1,200 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిగిలిన బకాయిల్లో అక్టోబర్ 31లోపు 50 శాతం, డిసెంబర్ 31లోపు మిగతా 50 శాతం బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి 31 లోపు 2 లేదా 3 వాయిదాల్లో నిధులు ఇచ్చేలా జీవో జారీ చేయాలని కోరారు. 

టెన్షన్ బతుకు మాకొద్దు..

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు చేతికి వస్తుందోనని టెన్షన్ పడుతున్నామని, ఈ టెన్షన్ బతుకు తమకొద్దని అసోషియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, నాలుగేళ్ల నుంచి సహకరిస్తూ వస్తున్నామని, అయినప్పటికీ.. తమకు న్యాయం జరగడం లేదని వాపోయింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం అప్పటివి, ఇప్పటివి కలిపి మొత్తంగా చెల్లించాలని స్పష్టం చేసింది.

కొందరు మంత్రులు గత ప్రభుత్వ బకాయిలతో తమకేం సంబంధమని మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలు తమనెంతో బాధించాయని తెలిపింది. తప్పుడు వ్యాఖ్యలు చేసి మంత్రులు తమ స్థాయిని తగ్గించుకోవద్దని, బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిలు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేసింది.

కొందరు కాంట్రాక్టర్లకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేశారని, కానీ..తాము ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా మౌనంగానే ఉన్నామని గుర్తుచేసింది. తమకు నేరుగా బకాయిలు ఇవ్వకుండా ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేసి, తద్వారా బకాయిలు ఇవ్వాలని ప్రతిపాదించామని, అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని తాము తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని పేర్కొంది.

లక్షలాది మంది విద్యార్థులతో సభ..

హైదరాబాద్ నడిబొడ్డున ఈనెల 23 లేదా 24వ తేదీన లక్షలాది మంది విద్యార్థులతో సభ నిర్వహిస్తామని అసోషియేషన్ స్పష్టం చేసింది. విద్యార్థులతో కలిసి రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక బంద్ కళాశాలల బంద్ కొనసాగిస్తామని, సర్కార్ ఈనెల 21లోపు గతంలో జారీ చేసిన టోకెన్లకు రూ.1,200 కోట్ల  రూ.1,800 కోట్లు విడుదల చేయాలని పేర్కొంది.

సోమవారం నుంచి విద్యార్థులెవరూ కాలేజీలకు రావొద్దని, వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించింది. ఇలాంటి పరిస్థితులు వచ్చినందుకు ప్రైవేట్ కాలేజీల అధ్యాపకులకు క్షమాపణలు తెలుపుతున్నట్లు ప్రకటించింది. సమావేశంలో అసోషియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కే సునీల్ కుమార్, ట్రెజరర్ కే కృష్ణారావు, నాయకులు రాందాసు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని స్థంబింపజేస్తాం..

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఏడాది నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సిబ్బంది, అధ్యాపకులకు జీతాల్లేక దసరా పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. ఈనెల 21 వరకు మేం ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. మాకు ఇచ్చిన టోకెన్లకు సొమ్ము విడుదల చేయకుంటే యావత్ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం.

  బీ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్ డిగ్రీ, 

పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

ఎలాంటి పరీక్షలు జరగవు..

విద్యార్థులు చదువువుతున్న కోర్సులకు జరగాల్సిన ఏ ఒక్క పరీక్షనూ నిర్వహించం. పరీక్షల నిర్వహ ణపై ఇప్పటికే అన్ని వర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లకు లేఖలు రాస్తాం. కళాశాలల బంద్‌ను అన్ని కాలేజీల యాజమాన్యాలు విజయవంతం చేయాలి.

 కేఎస్ రవికుమార్, 

‘ఫతి’ సెక్రటరీ జనరల్