15-09-2025 01:52:18 AM
లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ)లో ప్రమాదం సంభవించడంతో నిర్మాణంలో ఉన్న సొరంగం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సొరంగం నిర్మాణ పనులను త్వరలోనే పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ క్రమంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిరోజు మూడు షిఫ్టుల్లో కార్మికులు పనిచేస్తూ, ఇన్‌లెట్ వైపు నుంచి ఔట్‌లెట్ వైపు.. రెండు వైపుల నుంచి పనులు జరిగేలా, ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
పెండింగ్‌లో నిర్మాణ పనులు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీపై నిర్లక్ష్యం చూపగా, కాంగ్రెస్ అధి కారం చేపట్టాక ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో పనులు చకచకా ప్రారం భించింది. అనుకోకుండా జరిగిన ఘటనతో పనులకు బ్రేక్ పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ఒక భాగం కూలిపోయింది. అకస్మాత్తుగా నీరు, బురద ఉప్పెన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు, ఇంజినీర్లు చిక్కుకున్నారు.
చాలా కాలంగా పెండింగ్ పడిన పనులు ఇప్పుడు పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి 2027 డిసెంబర్ 9 నాటికి పనులు పూర్తిచేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా మూడు నెలల లక్ష్యాలతో కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పనులను తిరిగి ప్రారంభించడానికి, వేగంగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని అనుమతులను పొందేందుకు ఈ నెల 15లోపు క్యాబినెట్ సమావేశాన్ని షెడ్యూల్ చేయాలని సైతం ఆదేశించారు.
అధునాతన టెక్నాలజీ వినియోగం
గతంలో జరిగిన ప్రమాదాలు, సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ఈసారి అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో దెబ్బతిన్న పాత టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) స్థానంలో అమెరికా నుంచి అత్యాధునిక యంత్రాన్ని తెప్పించి, నూతన టెక్నాలజీతో పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు ప్రపంచస్థాయి సాంకేతికతను సొరంగం తవ్వకంలో వినియోగించడంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం ప్రపంచంలోని తాజా సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటైన హెలి-బోర్న్ సర్వేను ఎంచుకుంది. దీనిని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుంది. సొరంగం నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి గతంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్‌సింగ్‌ను ప్రభుత్వం ఇటీవల సలహాదారుగా నియమించింది.
ఆయన ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. అటల్ టన్నెతో తనకున్న అనుభవం ఆధారంగా నియమించారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం కారణంగా పాత యంత్రం సొరంగంలోనే చిక్కుకుపోయింది. దానిని బయటకు తీసే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆ మిషన్‌ను సొరంగంలోనే వదిలిపెట్టనున్నారు. అందుకే.. దాని చుట్టూ కాంక్రీట్ గోడ నిర్మించి పూర్తిగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ ప్రాంతం నుంచి అలైన్‌మెంట్‌ను మార్చి, మిగతా పనులను పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కీలక నిర్ణయం వల్ల పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవచ్చు. ఇప్పటికే సొరంగం ప్రాంతంలో మైనర్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ప్రధాన పనులను మూడు షిఫ్ట్‌ల్లో ప్రారంభం కానున్నాయి.
ఈ ప్రాజెక్టులో అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులను అధిగమించడానికి, ఎన్జీఆర్‌ఐ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) శాస్త్రవేత్తల సహకారాన్ని తీసుకోనున్నారు. వీరు ఏరియల్ లైడార్ సర్వే ద్వారా సొరంగ మార్గంలో ఉన్న శిలా నిర్మాణాలు, భూమి లోపల ఉన్న పరిస్థితులను అంచనా వేసి, సురక్షితమైన మార్గాన్ని సూచిస్తారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవ డానికి వీలవుతుంది.
ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలతో కూడా చర్చించినట్టు సమాచారం. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించడానికి మొత్తం 50.75 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగాలు నిర్మించాల్సి ఉంది. ఇందులో 44 కిలోమీటర్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఇంకా 9.6 కిలోమీటర్ల మేర పనులు మిగిలి ఉన్నాయి. ఈ మిగిలిన ప్రాజెక్టును పూర్తిచేయడానికి మూడు షిఫ్ట్‌ల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సొరంగం పనులు పూర్తయి వినియోగంలోకి వస్తే రోజుకు 0.3 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. ఇది దాదాపు 90 రోజులపాటు నీటిని అందిస్తుంది. పాత నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నీటి అవసరాలను తీరుస్తుంది.
నిర్మాణానికి నిధులెలా?
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా న్ని స్వాగతించాల్సిందే. కానీ కేవలం రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుందా? అనే అనుమానాలు రేకెత్తు తున్నాయి. వాస్తవానికి ఎస్‌ఎల్‌బీసీతోపాటు అటు పాలమూరు గారెడ్డి ప్రాజెక్టు కూడా చాలా కాలం గా పెండింగ్‌లోనే ఉన్నది. ఆ ప్రాజె క్టు పూర్తి చేసేందుకు వేల కోట్లు అవసరం పడనున్నాయి.
దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్తు న్న ప్రభుత్వం, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును తిరిగి ప్రారంభించే దిశ గా ప్రణాళికలు రచిస్తున్నది. ఈ క్రమంలో ఇటు ఎస్‌ఎల్‌బీసీ.. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారం లోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ముందుకు నడిపించడానికి, సంక్షేమ పథకాల అమ లుకు నిధులు లేవని చెప్తున్నది.
గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు కట్టలేకపోతున్నామని పదేపదే పే ర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులను ఇంత త్వరతిగతిన ఎలా పూ ర్తి చేయగలరని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వేల కోట్లు అవసరమయ్యే నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.