21-11-2025 07:33:29 PM
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్
వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): మొక్కజొన్న విత్తనోత్పత్తి గురించి సంబంధిత కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లతో వెంకటాపురం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్గనైజర్లు తప్పనిసరిగా రైతులతో అగ్రిమెంట్లు చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్నకి సంబంధించిన ఎరువులు పురుగుమందులు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకి అమ్మ రాదని సూచించారు. అగ్రిమెంట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సహాయ వ్యవసాయ సంచాలకులు అవినాష్ వర్మ మాట్లాడుతూ.. ఆర్గనైజర్లు సంబంధిత పంట పొలాల జిపిఎస్ చేసే సమయంలో రైతుల వద్ద నుండి అంగీకారం, సంతకం తీసుకోవాలని సూచించారు. ఆర్గనైజర్ల నుండి కొనుగోలు చేసి ఎరువులు, పురుగు మందులకు బిల్లులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ... మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి కంపెనీవారీగా ఏ ఊరిలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల్లో విత్తన ఉత్పత్తి చేస్తున్నారు, సంబంధిత వివరాలు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్గనైజర్లు నరసింహమూర్తి, ప్రసాద్ ,నాగరాజు, రాంబాబు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.