16 March, 2026 | 3:41 AM

షాద్‌నగర్‌లో కబ్జా సెగ

16-03-2026 12:58 AM

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై ఆరోపణలు..

రంగంలోకి ఎల్‌హెచ్‌పీఎస్ 

చటాన్‌పల్లి భూవివాదంలో ముదిరిన ఉద్రిక్తత...

అమాయక గిరిజనుల స్థలాలే టార్గెట్

నా ప్లాటు పోతే చావడమే గతి.. ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు

అలంపూర్ నుంచి వచ్చి ఇక్కడ దౌర్జన్యమా? నిలదీసిన గిరిజన సంఘం నేతలు 

షాద్‌నగర్, మార్చి 15 (విజయక్రాంతి): షాద్నగర్ పట్టణంలో భూ కబ్జారాయుళ్లు హల్చల్ సృష్టిస్తున్నారు. చటాన్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 674లో గల గిరిజనుల ఇళ్ల స్థలాలను అక్రమంగా ఆక్రమిస్తున్నారనే ఆరోపణలతో ఆదివారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కుమారుడు దీపక్ ప్రజ్ఞ మరియు అతని అనుచరులు గత మూడు రోజులుగా ఇక్కడ తిష్టవేసి, అమాయకుల ప్లాట్లలో కంచెలు వేసి కబ్జాకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కబ్జా కంచెలు కూల్చివేత..

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మూడవత్ రాంబల్ నాయక్, తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని పక్క నియోజకవర్గాల నుండి వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయడం తగదని ఆయన హెచ్చరించారు. లీగల్గా ప్లాట్లు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి ఆధీనంలో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. ఈ క్రమంలో కబ్జాదారులు వేసిన కంచెలను ఎల్ హెచ్ పి ఎస్ కార్యకర్తలు స్వయంగా కూల్చివేసి, బాధితులకు అండగా నిలిచారు.

కన్నీరు మున్నీరైన బాధితురాలు.. ఆత్మహత్యాయత్నం

ఈ గొడవ మధ్య ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చించోడు గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ, తన భర్త ఎంతో కష్టపడి కొన్న ప్లాటును కబ్జా చేశారని తెలిసి కన్నీరు మున్నీరైంది. ‘నాకున్నది ఈ ఒక్క ప్లాటే.. అది కూడా పోతే నాకు చావే శరణ్యం‘ అంటూ అక్కడే ఉన్న చెట్టుకు తాడు బిగించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు ఆమెను అడ్డుకుని ప్రాణాపాయం తప్పించారు.

రంగంలోకి పోలీసులు......

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కబ్జాదారులు ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని అక్కడి నుండి తొలగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నామని, చట్టవిరుద్ధంగా ఎవరు వ్యవ హరించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో ఈ భూవివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.